డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్‌మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్‌ఏ ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.
ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.
‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్‌లో ఓంపురి, రాజ్‌పాల్ యాదవ్‌లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా టీనేజ్‌లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.
‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్‌మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్‌కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.
ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్‌పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్‌గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్‌మెంట్‌ప్రొఫెషనల్‌గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.
ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంపెనీ.
సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్‌లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.
తాజా విషయానికి వస్తే...
ముంబైకి చెంది ఎఫ్‌ఏ ఎయిర్‌లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత
‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట.
Comments
Please login to add a commentAdd a comment