చారిత్రక కల్యాణ మండపం!
మైసూరుః ప్యాలెస్ లో పెళ్ళి సందడి మొదలైంది. మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహానికి ప్యాలెస్లో ప్రత్యేక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జూన్ 27న జరిగే వివాహ మహోత్సవానికి చారిత్రక కల్యాణ మండపాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. రాజవంశంలో 40 సంవత్సరాల తర్వాత జరుగుతున్న వివాహ కార్యక్రమం కావడంతో.. రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహం కోసం తరతరాలుగా కొనసాగుతున్నమండప సామగ్రికి మెరుగులు దిద్దుతున్నారు.
ఘనమైన చరిత్ర కలిగిన మైసూరు రాజకుటుంబంతోపాటు, అక్కడి ప్రతి వస్తువుకూ ఓ చరిత్ర ఉంది. మైసూర్ మహారాజుల వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహ కార్యక్రమానికి వంశపారంపర్యంగా కొనసాగుతున్న కల్యాణ మండపానికి ప్రత్యేక హంగులు సమకూరుస్తున్నారు. యువరాజు యదువీర్ పట్టాభిషేకం జరిగిన సమయంలో ఆయన అధిరోహించిన రజిత సింహాసనం (భద్రాసనం) కూడ ప్యాలెస్ లో ప్రత్యేకాకకర్షణగా నిలిచింది. అదేరీతిలో అత్యంత ఐశ్వర్యవంతుడైన యువరాజు వివాహానికి ఇప్పుడు అనువంశికంగా వచ్చే వెండి సింహాసనాన్ని ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అనువంశిక సంప్రదాయ మండపానికి సైతం మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే పూజాకార్యక్రమాలతో పెళ్ళి సందడి ప్రారంభం కాగా... ఖరీదైన చెక్కతో రూపొందించిన కల్యాణ మండపాన్ని, అద్దాల ఆడిటోరియంలోకి తరలించారు. మహారాజులు పట్టాభిషేక సమయంలో మాత్రమే భద్రాసనా ఉపయోగిస్తారు. పది అడుగులు ఎత్తు ఉండే మండపం... రాజ కుంటుంబ సభ్యుల వివాహాల సందర్భంలోనే బయటకు తీస్తారు.
41 ఏళ్ళ తర్వాత గత మే నెలలో యదువీర్ కృష్ణదత్త పట్టాభిషేక సమయంలో భద్రాసనా వినియోగించగా... మండపం మాత్రం రాజకుంటుంబం 1992 లో మైసూరు రాజు పెళ్ళి సందర్భంలో వినియోగించారు. అనంతరం యువరాజు యదువీర్ వివాహం కోసం ప్రస్తుతం వినియోగంలోకి తెస్తున్నారు. ఈ మండపాన్ని మహారాజు కుటుంబంలోని సభ్యుల పెళ్ళిళ్ళకు వాడిన తర్వాత తిరిగి ఏ భాగానికి ఆ భాగం విడదీసి సురక్షితంగా భద్రపరుస్తుంటారు. శివపార్వతుల వివాహ మహోత్సవమైన గిరిజా కల్యాణానికి సంబంధించిన చిత్రాలతో కూడిన ఈ మండపం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. మండపాన్ని 1912 లో రూపొందినప్పటినుంచీ ఇందులో ముగ్గురు మహారాజుల పట్టాభిషేకాలు, రెండు డజన్ల వివాహ మహోత్సవాలు జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మహారాజులు, ఇతర రాజకుటుంబ సభ్యుల వివాహాలు, పుట్టినరోజు వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాలకు ఈ అష్టభుజ కల్యాణ మండపం నిర్మించినట్లు చెప్తారు. అయితే 1897 లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంతో ప్యాలెస్ లోని అధికభాగం దగ్ధమైపోయింది. ఆ తర్వాత రాజ కుటుంబీకులు తిరిగి ఆ నిర్మాణాన్ని విలక్షణంగా నిర్మించారు. ఈసారి నిర్మాణంలో ప్రత్యేకంగా ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడినట్లు తెలుస్తోంది.
ఈ మండపాన్ని కేవలం రాజకుటుంబీకుల వివాహాలకోసమే రూపొందించారని, రాజకుటుంబం నమ్మకాలు, సంప్రదాయాలను బాగా తెలిసిన వ్యక్తి, యు ఆర్ ఎస్ కమ్యూనిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. మండపాన్ని ఏర్పాటు చేసే ఆడిటోరియంలో సైతం మూడు పక్కల గోడలూ మైసూరు శైలి చిత్రాలతో సుందరంగా అంకరించబడి ఉంటాయి. దసరా వేడుకలకు సంబంధించిన ఏనుగు బంగారు అంబారీపై మహారాజులు కూర్చున్నట్లుగా ఉండే చిత్రాలు, పురాణ కథలు ఈ గోడలపై నిక్షిప్తమై... రాచరికపు సాక్ష్యాలను ప్రస్ఫుటింపజేస్తాయి.