మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్‌లో జరిగే ఉత్సవాలు. ఇదీ ఒక్కమాటలో చెప్పాలంటే మైసూర్ టూర్. వడయార్ రాజకుటుంబీకులు మైసూర్ ప్యాలెస్‌లో సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా పబ్లిక్‌ను ప్యాలెస్‌లోకి అనుమతిస్తారు. ప్యాలెస్ లోపల వడయార్ కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులు, నాటి హస్తకళాఖండాలుంటాయి.
దర్బార్ హాల్‌లో బంగారు సింహాసనాన్ని చూడవచ్చు. ఆ రోజుల్లో అందంగా అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలో ప్రత్యేకాకర్షణ. పది రోజుల పాటు ప్యాలెస్ ఆవరణలో సంగీత, నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. మైసూర్ ప్యాలెస్‌ని చూసిన తర్వాత కరంజి లేక్‌లో బోట్ షికారు చేసి, వన్యప్రాణుల మధ్య విహరించాలి. జయచామరేంద్ర ఆర్ట్ గ్యాలరీ, ఫిలోమినా చర్చ్ కోసం కూడా కొంత టైమ్ కేటాయించుకోవాలి. ఇక మైసూరు వంటలను రుచి చూడడంతోపాటు మైసూర్ సిల్క్ చీరలను కొనడంతో ట్రిప్ పరిపూర్ణమవుతుంది. పిల్లలతో వెళ్లిన వాళ్లు తప్పకుండా రైల్ మ్యూజియాన్ని కవర్ చేయాలి.
ఉదయాన్నే చూడాలి..!
మైసూర్ ప్యాలెస్‌లోకి పదిగంటలకు పర్యాటకులను అనుమతిస్తారు. ఆ సమయానికి పది నమిషాల ముందే చేరినట్లయితే జనం తక్కువగా ఉంటారు. పదిన్నర తర్వాత ప్రతి అరగంటకు జనసమ్మర్దం గణనీయంగా పెరుగుతుంది. తొమ్మిదింటికే చేరగలిగితే సూర్యకిరణాలకు మెరిసే ప్యాలెస్ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు.
ప్యాలెస్ లోపల ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. కెమెరాకు టికెట్ తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రమే అనుమతిస్తారు
పర్యాటకుల వస్త్రధారణ ప్యాలెస్ నియమాలకు లోబడి ఉండాలి. దుస్తులు భుజాలను కవర్ చేస్తూ, మోకాళ్ల కింద వరకు ఉండాలి ∙
ప్యాలెస్ లోపల కొన్ని చోట్లకు పాదరక్షలను అనుమతించరు. ఈ కాలం నేల చల్లగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సాక్స్ వేయడం మంచిది
పెద్దవాళ్లు ప్యాలెస్ మొత్తం నడుస్తూ చూడడం కష్టమే. సిద్ధంగా ఉంచిన వీల్ చైర్‌లను వాడుకోవచ్చు. గైడ్ చెప్పే ఆసక్తికరమైన, హాస్యపూరితమైన కథనాలను ఎంజాయ్ చేయవచ్చు
ఆడియో గైడ్ సౌకర్యం ఉంది. దానికి చార్జ్ ఎక్కువనిపించినప్పటికీ తప్పకుండా ఆడియోలో ప్యాలెస్ గురించిన వివరాలను వింటూ తిలకించాలి
రాత్రి లైట్ షో కూడా చూడాలి. ఆ షోకు కూడా ముందుగా వెళ్తే షో బాగా వీక్షించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment