భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు బ్యాంక్ మోసం కేసులో సోమవారం అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే రతుల్ పూరి అరెస్టు నేపథ్యంలో తన మేనల్లుడి వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వాటాదారుడి కానని కమల్ నాథ్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వక చర్య అని, ఈ విషయంలో కోర్టులపై తనకు పూర్తి నమ్మకం ఉందని రతుల్ పూరి అరెస్టుపై ఆయన అభిప్రాయపడ్డారు.
చదవండి: సీఎం మేనల్లుడికి ఈడీ షాక్
కాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన 354 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో రతుల్ పురి, అతని తండ్రి దీపక్ పురి, తల్లి నీతా (నాథ్ సోదరి), ఇతరులపై గతవారం (ఆగస్టు 17న) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రతుల్ పూరిని మూడు ప్రధాన కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నాయి.
అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసుకు సంబంధించి రతుల్ పూరిని విడిగా విచారిస్తున్నారు. అంతేకాక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కారణంగా అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన తర్వాత అతడిని నిందితుడుగా అరెస్టు చేశారు. ఈ మేరకు పూరీని కస్టడీలోకి (అదుపులో) తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. మరోవైపు రతుల్ పురి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment