
పనిచేయకుంటే చొక్కాపట్టుకుని నిలదీయండన్న కమల్‌నాధ్
భోపాల్ : తన కుమారుడు నియోజకవర్గ అభివృద్ధికి పని చేయకుంటే అతని చొక్కా పట్టుకుని నిలదీయండని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎం కమల్‌నాధ్ అన్నారు. చింద్వారా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న కుమారుడు నకుల్ తరపున కమల్‌నాధ్ ప్రచార సభల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చింద్వారాతో నాలుగు దశాబ్ధాల అనుబంధం ఉన్న తాను ఇప్పుడు తన కుమారుడిని నియోజకవర్గానికి అప్పగిస్తున్నానని చెప్పారు.
చింద్వారా ప్రజలు పంచిన ప్రేమ, ఆప్యాయతలతోనే తాను ఈస్ధాయికి ఎదిగానని, ఈ బాధ్యతలను ఇప్పుడు తన కుమారుడు నకుల్‌కు అప్పగిస్తున్నానని కమల్‌నాధ్ స్ధానికులతో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ చౌహన్‌లు ప్రజల్ని మభ్యపెట్టడం మినహా చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొమ్మిది సార్లు ప్రాతినిధ్యం వహించిన కమల్‌నాధ్ ప్రస్తుతం తన కుమారుడి కోసం ఈ స్ధానాన్ని వదులుకున్నారు. మరోవైపు సీఎం కమల్‌నాధ్ చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.