న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జేఎన్యూకు వెళ్లాడు. వర్సిటీకి చేరుకున్న విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకు తోటి వర్సిటీ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని కోర్టు నిర్దేశించింది.
అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. ఆరు నెలల బెయిల్ మంజూరు కావడంతో కొన్ని షరతులతో విడుదలయ్యాడు. ఫిబ్రవరి 12న కన్హయ్య అరెస్టయిన విషయం విదితమే.
బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్
Published Thu, Mar 3 2016 7:28 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement