
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమా ట్రైలర్‌పై దుమారం రేగుతోంది. గురువారం విడుదలైన ఈ ట్రైలర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మన్మోహన్ సింగ్‌ను ముందుపెట్టి కాంగ్రెస్ పది సంవత్సరాల పాటు దేశాన్ని దోచుకున్న తీరుకు ఇది నిదర్శనం అని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యనించగా, నాలుగున్నరేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ చేసిన ట్వీట్... జేడీఎస్- బీజేపీ అభిమానుల మధ్య చిచ్చు రాజేస్తోంది.
మరి యాక్సిడెంటల్ సీఎం ఎవరు?
‘ ఒకవేళ యాక్సిడెంటల్ సీఎం అనే సినిమా తెరకెక్కితే.. ఆ పాత్రను ఎవరు పోషిస్తారు.. హెచ్‌డీ కుమారస్వామేనా’ అని ట్వీట్ చేసిన కర్ణాటక బీజేపీ.. సీఎం కుమారస్వామిని ట్యాగ్ చేసింది. ఈ క్రమంలో... ‘కుమారస్వామి, ఆయన తండ్రి మంచి నటులు... వాళ్లకు ఉన్నదంతా ఇటాలియన్ మాఫియా చేతిలో పెట్టారు’ అని ఒకరు కామెంట్ చేయగా... ‘ఒకవేళ చెక్‌సీఎం అనే సినిమా తీస్తే.. యడ్యూరప్ప ఆ పాత్ర పోషిస్తారా’ అంటూ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
If there was a movie titled #AccidentalCM who will play the role of @hd_kumaraswamy ?
— BJP Karnataka (@BJP4Karnataka) December 29, 2018
కాగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్ 78 స్ధానాలను హస్తగతం చేసుకుంది. ఈ క్రమంలో 37 స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌తో కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment