జమ్మూకశ్మీర్‌లో గస్తీ నిర్వహిస్తున్న భద్రతా దళాలు (ఫైల్ ఫొటో)
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 ఏళ్ల ఫర్హాన్ వనీ కూడా ప్రాణాలు విడిచాడు. కుల్గామ్ జిల్లాలోని ఖుద్వానీ గ్రామానికి చెందిన ఫర్హాన్ వనీ గత ఏడాది మధ్యలో మిలిటెన్సీలో చేరాడు. గత నవంబర్‌లో అతని తండ్రి గులం మహమ్మద్ వనీ ఫేస్‌బుక్‌లో కొడుకును ఉద్దేశించి భావోద్వేగమైన పోస్టు పెట్టాడు. ‘బిడ్డా హింసను విడనాడి.. ఇంటికి తిరిగిరా’ అంటూ హృదయాన్ని పిండేసిరీతిలో విజ్ఞప్తి చేశాడు.
‘బిడ్డా.. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లిన నాటినుంచి నా శరీరం నా మాట వినడం లేదు. నువ్వు చేసిన దానికి బాధతో నేను అల్లాడిపోతున్నాను. అయినా నువ్వు ఇంటికి తిరిగి వస్తావన్న నమ్మకం నాలో ఉంది’ అని గులాం నవంబర్ 24న వనీ ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశాడు.
‘చిరునవ్వుతో కూడిన నీ ముఖాన్ని నేనెంతగా మిస్ అవుతున్నానో వివరించలేను. నువ్వు వెళ్లి ఆరు నెలలు అవుతోంది. నీ ఆలోచన లేకుండా ఒక్క నిమిషం కూడా నాకు గడవడం లేదు. నువ్వు బాగున్నావని, బాగుంటావని ఆశతో బతుకుతున్నాను. నేను నీ తండ్రిని. నేను కాకపోతే ఈ విషయాన్ని ఎవరు నీకు చెప్తారు.. నేను చనిపోతానేమో అనిపిస్తోంది. నాకు మరో మార్గం లేదు. నీకు నేను చాలా చెప్పాల్సి ఉంది. ఎంతో నేర్పించాల్సి ఉంది. తిడుతూ నీకు సాయం చేయాల్సి ఉంది’ అంటూ హృదయాన్ని కదిలించేరీతిలో గులాం ఈ పోస్టు పెట్టారు. వనీ తల్లి కూడా కొడుకు కోసం ఎంతో తపించిపోతున్నదని, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని వదిలి ఇంటికి తిరిగి రావాలని, గడిచిందంతా మరిచిపోవాలని, నువ్వు ఎంచుకున్న మార్గం వల్ల నువ్వు శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం కూడా ఉందని, కాబట్టి త్వరగా ఇంటికి తిరిగిరావాలని వేడుకుంటూ గులాం ఈ పోస్టు పెట్టాడు. మిలిటెన్సీలో చేరిన ఫుట్‌బాలర్ మజిద్ ఖాన్.. తన తల్లిదండ్రులు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు చూసి.. తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నేపథ్యంలో గులాం కూడా అదే ఆశతో ఈ పోస్టు పెట్టాడు. పోలీసులు కూడా మిలిటెన్సీలో కలిసిపోయిన స్థానిక యువకులు, విద్యార్థులు తిరిగి జనజీవనస్రవంతిలో కలువాలని, వారిపై ఎలాంటి కేసులు, విచారణలు ఉండవని భరోసా ఇస్తున్నారు. అయినా, అతని పోస్టు వృథానే అయింది. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఫర్హాన్ వనీ మృతిచెందడం ఆయన కుటుంబంలో విషాదం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment