వందల పెల్లెట్లు దిగాయి... చూపు పోయింది
జమ్ము,కశ్మీర్ : కశ్మీర్ లోయలో జరుగుతున్న హింస వందలాది యువకులను వికలాంగులుగా మారుస్తోంది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వాడే పెల్లెట్ గన్ ప్రయోగం వివాదాస్పదమవుతోంది. పాత బారాముల్లా, పఠాన్, ఉత్తర, దక్షిణ కశ్మీర, పులవామా జిల్లాల్లో పిల్లెట్ గన్ బాధితుల సంఖ్య రోజుకు రోజుకూ పెరుగుతోంది.
తాజాగా ఉత్తర కశ్మీర్ జిల్లాలో మిర్వాజ్ మౌల్వి ఫరూఖ్ 25వ వర్ధంతి సందర్భంగా గురువారం జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పులతో ఒక యువకుడు తన కంటిచూపును కోల్పోయాడు. పోలీసులు అతి తక్కువ దూరం నుండి జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో అనేకమంది గాయాల పాలయ్యారు. హమీద్ భట్ అనే పదహారేళ్ల యువకుడి ముఖం, తలలోకి దాదాపు 100 పెల్లెట్స్ (ఇనుప గోలీలు) దూసుకుపోయాయి. దీంతో అతని కుడికన్ను చూపును కోల్పోయాడు.
కళ్లు, పెదాలు, ముక్కు ఇలా ముఖం అంగుళం ఖాళీ లేకుండా చాలా దారుణంగా గోలీలు దిగబడ్డాయి. అతని ముఖాన్ని తూట్లు, తూట్లుగా రంధ్రాలు చేశాయి. తీవ్ర గాయాలతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ర్యాలీకి తమ కొడుక్కి సంబంధం లేదని భట్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా అతి సమీపం నుండి కాల్పులు జరిపారని తెలిపారు. రక్తమోడుతున్న అతన్ని ముఖాన్ని చూసి మొదట పోల్చుకోలేకపోయామని హమీద్ సోదరుడు జునైద్ నజీర్ తెలిపారు.
గత ఐదేళ్లుగా ఇలా పెల్లెట్ గన్ కాల్పుల మూలంగా చాలామంది యువకులు చూపును కోల్పోతున్న కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోందని డాక్టర్ రషీద్ అన్నారు. ముఖ్యంగా శ్రీ మహారాజ్ హరిసింగ్, బెమినా ఆసుపత్రి వైద్యులు చెపుతున్న లెక్కల ప్రకారం సుమారు 700మందికి పైగా యువకులు తమ చూపును కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇలాంటి కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంపై శ్రీనగర్ కు చెందిన ప్రముఖ సీనియర్ నేత్ర వైద్యులు కూడా కలవరపడుతున్నారు. గాయపడిన యువకులు ప్రాణాలకు ప్రమాదం లేకున్నా... జీవితాన్ని కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో పెల్లెట్ గన్స్ వాడకాన్ని ప్రభుత్వం నియంత్రించింది. అయినా కొన్ని నగర శివారు ప్రాంతాల్లో, గ్రామాల్లోని కొన్నివెనుకబడిన ప్రాంతాలు, లోయ ప్రాంతాల్లో పెల్లెట్ గన్నును పోలీసులు విచ్చల విడిగా వాడుతున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. పెద్దగా హాని చేయని 9 నంబరు పెల్లెట్స్ వాడాలని రాతపూర్వక ఆదేశాలున్నా 5-12 నంబరు పెల్లెట్స్ వాడుతున్నారని మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడతునే ఉన్నాయి.
మరోవైపు పోలీసుల వేధింపులు, అరెస్టులకు భయపడిన గాయపడిన చాలామంది శరీరంలో పెల్లెట్స్, ఇన్ఫెక్షన్స్తోనే ఆసుపత్రుల నుండి వెళ్లిపోతున్నారని సమాచారం. అయితే విద్యాశాఖమంత్రి నయీమ్ అక్తర్ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించాయి. ఈ విషయం తమ దృష్టికి రాలేదనీ, పెల్లెట్ గన్స్ వాడకంపై వారి కారణాలు వారికి ఉంటాయంటూ పోలీసులను వెనకేసుకొచ్చారు. తొందరలోనే వీటిని నిషేధిస్తారని ఆశిస్తున్నానన్నారు. దీంతో ముఫ్తీ మహమ్మద్ సయాద్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ ఆరోపణలను పోలీసులు అధికారులు ఖండిస్తున్నారు. నిబంధనల పరిధిలోనే వీటిని వాడుతున్నామంటున్నారు. ఒకసారి పెల్లెట్ గన్ ప్రయోగిస్తే ఒక్కసారిగా వందలాది గోలీలు ఆందోళనకారులపై దూసుకుపోతాయని.. అందుకే ఎక్కువమంది గాయపడుతూ ఉంటారని పోలీసు అధికారులంటున్నారు.