హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ సంస్థను లాభాలతో పురోగమిస్తున్న భెల్, బీడీఎల్, హెచ్‌ఏఎల్, మిథాని ఈటీసీల్లో ఏదో ఒకదానిలో విలీనం చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం నిర్వహణ లేమితో ఉన్న హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ సంస్థను లాభాలతో పురోగమిస్తున్న భెల్, బీడీఎల్, హెచ్‌ఏఎల్, మిథాని ఈటీసీల్లో ఏదో ఒకదానిలో విలీనం చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. తద్వారా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. ఈ మేరకు 3 పేజీల వినతి పత్రాన్ని శుక్రవారం ప్రధానికి అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్(బెంగళూరు) సంస్థ 1956లో హైదరాబాద్‌లో యంత్ర సామగ్రి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఒకప్పుడు 4 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, 10 వేల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పించిందన్నారు. అయితే, ప్రస్తుతం 451 మంది ఉద్యోగులతో నిర్వహణ కష్టసాధ్యంగా ఉందని, ఇంత దీనస్థితిలో కూడా సంస్థకు రూ.140 కోట్ల ఆర్డర్లున్నాయని కేసీఆర్ వివరించారు. వివిధ ఆర్డినెన్సు ఫ్యాక్టరీల నుంచి ఈ కంపెనీకి రూ. వంద కోట్లకు పైగా ఆర్డర్లున్నాయని, ఈ దృష్ట్యా హైదరాబాద్ యూనిట్‌ను లాభాల సంస్థలోకి విలీనం చేస్తే ఉత్పత్తిని పెంచవచ్చని అభిప్రాయపడ్డారు.