న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ గడువు ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ గడువు పొడిగించాలా, వద్దా అనే దానిపై నిర్ణయాన్ని ప్రజలకే వదిలిపెట్టాలని ఆయన భావించారు. మే 17 తర్వాత లాక్‌డౌన్ కొనసాగించాలా, అవసరం లేదా అనే దానిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1031 నంబర్, వాట్సప్ నంబరు 8800007722 లేదా delhicm.suggestions@gmail.com సలహాలు, సూచనలు పంపాలని ప్రజలను కోరారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చని ప్రకటించారు. కాగా, లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించాలని ప్రధాని మోదీకి పలువురు ముఖ్యమంత్రులు సూచించారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ నిర్వహణ, ఆర్థిక రంగ ఉద్దీపన సహా పలు అంశాలపై సోమవారం రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి తమ సమగ్ర వ్యూహాలను మే 15 లోగా పంపించాలని ముఖ్యమంత్రులను ఈ సందర్భంగా ప్రధాని కోరారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. (రీస్టార్ట్‌కి రెడీ అవుదాం)
Comments
Please login to add a commentAdd a comment