తిరువనంతపురం : మద్యం విధానాన్ని సరళీకరిస్తూ కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పబ్‌ల ఏర్పాటుకు అనుమతించింది. రాష్ట్రంలో పబ్‌లు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా గత మద్యం విధానాన్ని పునఃసమీక్షించామని చెప్పారు. రోజంతా ఎక్కువ సమయం పనిచేసి అలిసిపోయే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్ ఫిర్యాదు మేరకు వారి ఉల్లాసం కోసం పబ్‌లను అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. కేరళ బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహించే రిటైల్ మద్యం దుకాణాల్లోనూ వినియోగదారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు.
మద్యం దుకాణాల ముందు భారీ క్యూలను నివారించేందుకు రాష్ట్రంలో మరిన్ని లిక్కర్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలిస్తున్నామని అన్నారు. కాగా గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సర్కార్ కేరళలో మద్యంపై పాక్షిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఫైవ్‌స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం విక్రయాలకు అనుమతించారు. దీంతో 2014-17లో 600కు పైగా బార్లు మూతపడ్డాయి. ఆ తర్వాత వాటిని బీర్, వైన్ పార్లర్‌లుగా మార్చారు. 2016లో అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం మద్య నిషేధ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. త్రీస్టార్ హోటళ్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment