
దైవభూమిగా.. ఎల్లప్పుడూ పచ్చని వాతావరణంతో పరిమళ్లిలే కేరళ... ప్రకృతి ప్రకోపానికి కకావికలమైంది. భారీ వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారింది. ఈ మలయాళ రాష్ట్రంలో మరణ మృదంగం మోగింది. ఎటుచూసినా నీరే... ఎక్కడచూసినా సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులే. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలమంది దుర్మరణం పాలయ్యారు. లక్షలాదిమంది గూడులేక నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో కేరళ ఇలాంటి జలప్రళయాన్ని కనీవినీ ఎరుగదు. ఈ ప్రకృతి విలయతాండవానికి ప్రభావితమైన కేరళను ఆదుకోవడానికి దేశదేశాల నుంచి విరాళాలు కదలివస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి... దిగ్గజ కంపెనీలు, వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలు తోచినంత సహాయం చేస్తూ కేరళ ప్రజలను ఆదుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కేరళ కోసం భారీ ఎత్తున్న విరాళాల సేకరణ జరుగుతోంది. వారికి కావాల్సిన దుస్తులు, ఆహారాన్ని కూడా సహాయక బృందాలు, ఎన్‌జీవోల ద్వారా తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కేరళకు ఎంతమేర విరాళాలు వచ్చాయో ఓ సారి చూద్దాం..
1. జల విలయంతో కకావికలమైన కేరళకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.500 కోట్ల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించిన రూ.100 కోట్లకు ఇది అదనం. అలాగే, కేరళ వరదల్లో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున; తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ప్రధాని మోదీ నష్టపరిహారం ప్రకటించారు.
2. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ సీఎంతో మాట్లాడిన కేజ్రీవాల్ వరదల గురించి తెలుసుకుని, ఆయన చలించిపోయి తనవంతుగా ‘కేరళ సీఎం రిలీఫ్ ఫండ్’కు ఈ ఆర్థిక సాయం చేశారు. అంతేకాక ఆప్ ఎంఎల్‌ఏలు, ఎంపీల నెల వేతనాన్ని కేరళకే విరాళంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎంఎల్‌ఏలు కూడా నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ.10 కోట్లు ఇచ్చారు. ఇక.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కేరళ వరద సాయాన్ని రెట్టింపు చేశారు. గతంలో ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సీఎం.. మరో ఐదు కోట్ల రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు 8 కోట్ల విలువచేసే పాలిథీన్ షీట్స్ పంపించారు. అలాగే 244 మంది అగ్నిమాపక దళ సిబ్బందిని, 75 బోట్లను ప్రత్యేక విమానంలో కేరళకు తరలించారు.
3. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రకృతి ప్రకోపానికి అల్లకల్లోలమైన కేరళకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.10 కోట్లు, పుదుచ్చేరి కోటి రూపాయలు, జార్ఖండ్ రూ.5 కోట్లు, మహారాష్ట్ర రూ.20 కోట్లు, గుజరాత్ రూ.10 కోట్లు, పంజాబ్ రూ.10 కోట్లు, తెలంగాణ రూ.25 కోట్లు, బిహార్ రూ.10 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రూ.5 కోట్లు, ఉత్తరాఖండ్ రూ.5 కోట్లు, చత్తీష్‌గఢ్ రూ.3 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.10 కోట్లు, కర్నాటక రూ.10 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.10 కోట్లు, మణిపూర్ రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు.
4. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన నెల జీతాన్ని వరద ప్రభావిత రాష్ట్రానికి అందిస్తున్నట్టు తెలిపారు. తన కొలీగ్స్‌కు కూడా ఇదే సూచించారు. తమిళనాడు ఐఎఎస్ అధికారులు కేరళలో వరద ఉపశమనం కోసం ఒక రోజు వేతనాలు అందజేశారు. ముస్లింలు ఈద్ బడ్జెట్‌లో 10 శాతాన్ని కేరళకు డొనేట్ చేయాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది.
5. తమిళనాడు రాజకీయ పార్టీ డీఎంకే కోటి రూపాయలను, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రూ.2 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఇతర రాజకీయ నాయకులు కూడా కేరళకు సహాయం చేస్తున్నారు. అటార్ని జనరల్ కేకే వేణుగోపాల్ కోటి రూపాయలను, ఆయన కొడుకు, సీనియర్ న్యాయవాది క్రిష్ణన్ కూడా మరో రూ.15 లక్షలను కేరళకు విరాళమిచ్చారు. న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు చెప్పుకోదగ్గ డబ్బును విరాళంగా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులంతా కూడా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం ప్రకటించింది.
6. రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించిన కేరళ వరద సహాయనిధి సేకరణకు విశేష స్పందన లభించింది. కేరళ వరదల బాధితులకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు సైతం తమకు తోచినంత సాయం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రోటరీ క్లబ్ రూ.4 లక్షలు, ఇంక్రిడబుల్ ఇండియా రూ.2 లక్షలు, విజయాబ్యాంక్ రూ.2 లక్షలు, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, జిల్లా జడ్జి రాధారాణిలు తమ నెల జీతాన్ని విరాళంగా అందజేశారు.
7. కేరళను ఆదుకునేందుకు దేశవిదేశాల నుంచి దాతలు స్పందిస్తున్నారు. భారత సంతతికి చెందిన యూఏఈ వ్యాపారవేత్తలు ఆదివారం రూ.12.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ మూలాలున్న లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ఫాతిమా హెల్త్‌కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ రూ.5 కోట్ల చొప్పున ప్రకటించారు. యునిమొని అండ్ యూఏఈ ఎక్స్చేంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి రూ. 2 కోట్లు, అస్టర్ డీఎమ్ హెల్త్‌కేర్ చైర్మన్, అజద్ మూపెన్ రూ. 50 లక్షల సాయం చేశారు. 300లకు పైగా వాలంటీర్లను వైద్య సేవల నిమిత్తం అందుబాటులో ఉంచామని మూపెన్ తెలిపారు. మరోవైపు ఖతార్ చారిటీ రూ.34.89 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వరదల్లో నిరాశ్రయులైన వారి కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు గల్ఫ్ టైమ్స్ తెలిపింది.
8. కేరళ బాధితుల కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా తన వంతు విరాళంగా 2,50,000 డాలర్లను అంటే 1.75 కోట్ల రూపాయలను ప్రకటించింది. వీటిని వరదల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల బాధితులకుఅందజేయనున్నట్టు పేర్కొంది. కమ్యూనిటీ రెసిలియన్స్ ఫండ్ గూంజ్ ద్వారా ఈ నగదును విరాళంగా అందజేస్తున్నట్టు తెలిపింది. ఇది ఢిల్లీకి చెందిన లాభాపేక్షలేని సంస్థ.
9. వరద బాధితుల కోసం ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు కోటిన్నర విలువ చేసే వస్తువులను కేరళ, కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సైన్యం చేపట్టిన సహాయక చర్యలను చూసి జాతీ గర్విస్తుందన్నారు.
10. మరోవైపు కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. విక్రమ్ 35 లక్షల సాయాన్ని ప్రకటించారు. రజనీకాంత్, కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, సూర్య, విజయ్ సేతుపతి, ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ 25 లక్షల చొప్పున ప్రకటించారు. నాగార్జున 28 లక్షలు విరాళంగా ఇచ్చారు. ధనుష్ రూ.15 లక్షలను, విశాల్, శివకార్తికేయన్ రూ.10 లక్షల చొప్పున విరాళంగా అందించారు. ఎస్‌బీఐ 2 కోట్లు, ఆటోమొబైల్ కంపెనీ హుందాయ్ కోటి అందించింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలిసి 50 లక్షలతో పాటు మరో 10 లక్షల విలువైన మందులు అందించారు. కేరళ ప్రజలు ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకునే బన్నీ 25 లక్షలు ప్రకటించగా.. కల్యాణ్‌రామ్ 10 లక్షలు ఇచ్చారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ 5 లక్షలు, దర్శకుడు కొరటాల శివ 3 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ లక్ష రూపాయలను, నటి రోహిణి రూ.2 లక్షలకు తమవంతు సాయంగా రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఇటీవల ఘనవిజయం సాధించిన గీత గోవిందం చిత్ర నిర్మాత బన్నీ వాసు తమ చిత్ర కేరళ వసూళ్లను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు.
11. అమ్మ ఆర్గనైజేషన్ రూ.10 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసింది. స్టార్ ఇండియా రూ.2 కోట్లను, సన్ నెట్‌వర్క్ కోటి రూపాయలను, ఆసియానెట్ రూ.25 లక్షలను అందజేస్తున్నట్టు ప్రకటించాయి. స్టార్ ఇండియా ఎన్‌జీఓ సంస్థ గూంజ్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని కేరళకు అవసరమయ్యే సహాయాన్ని అందిస్తోంది.
12. ఎర్నాకులం జిల్లాలోని కీజిల్లం లో ఉన్న ప్రముఖ ఆలయం దాని ట్రెజరీని సీఎండీఆర్‌ఎఫ్‌కు విరాళంగా ఇచ్చింది. మాతా అమృతానందమయి దేవి (అమ్మ) తన సంస్థ సంస్థ నుంచి రూ.10 కోట్లను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి అందజేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 50వేల మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను బాధితులకు తరలించింది.
దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కేరళ కోసం భారీ ఎత్తున విరాళ సేకరణ జరుగుతోంది. ఆహారం, దుస్తులు, న్యాప్‌కీన్స్ వంటి కనీస వస్తువులను కేరళకు అందిస్తున్నారు. కేరళ ప్రజల పరిస్థితికి నలుమూలల నుంచి విరాళాలు పెద్ద ఎత్తునే తరలివస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment