
తిరువనంతపురం: తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాదిరి శబరిమలలో కూడా అయ్యప్ప భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ త్వరలో తిరుమల సందర్శించి అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులు, వసతుల కల్పనపై అధ్యయనం చేయనున్నట్లు దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ అధ్యయనానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారన్నారు.
శబరిమల ఆలయం నవంబర్-జనవరి మూడు నెలలే తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా లక్షలమంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. మళయాళ కేలండర్ ప్రకారం ఈ సీజన్‌లో పూజల కోసం నెలకు ఐదు రోజులు మాత్రమే ఆలయం తెరుస్తారు. ఈ సీజన్‌లో జనవరి 14 మకర విళక్కు వరకు ఆలయానికి రూ.225 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఏడాది ఇదే సీజన్‌లో లభించిన దానికంటే రూ.45 కోట్లు అధికమని మంత్రి వివరించారు. ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం మళ్లిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఇక్కడ భక్తుల కోసం సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కోట్లలో ఖర్చు పెడుతోందన్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణాలకు ఈ సీజన్‌లో రూ.38 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. సన్నిధానం పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్‌ను నిషేధించామని, కేరళ వాటర్ అథారిటీ ఔషధపరమైన నీటిని యాత్రికులకు అందిస్తోందని మంత్రి సురేంద్రన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment