కొచ్చి : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై చర్యలు తీసుకోవడం లేదంటూ సన్యాసినులు కొచ్చిలో నిరసనకు దిగారు. ఉత్తర భారతదేశానికి చెందిన డియోసెస్ కేథలిక్ మత గురువు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కేరళకు చెందిన సన్యాసిని రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచి 2016 వరకు తనను 13 సార్లు వేధించాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మత పెద్దలకు ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా తాను కేసు వాపసు తీసుకుంటే భూమి, బంగళా సహా అన్నీ సదుపాయాలు సమకూరుస్తానని బిషప్ తనను ఫోన్‌లో సంప్రదిస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపును కూడా బహిర్గతం చేశారు. ఇదంతా జరిగి 70 రోజులు పూర్తి కావస్తున్నా సదరు సన్యాసినికి న్యాయం జరగకపోవడంతో తోటి సన్యాసినులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఫ్రాంకోపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టుకుని హైకోర్టు జంక్షన్‌లో ధర్నాకు దిగారు. పలువురు సామాజిక కార్యకర్తలు వీరికి మద్దతుగా నిలిచారు.
ఫిర్యాదులోని లొసుగులు అడ్డుపెట్టుకుని..
గత కొన్ని సంవత్సరాలుగా తమ తోటి సన్యాసిని మానసిక వేదన అనుభవిస్తున్నారని సన్యాసినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులోని లొసుగులు అడ్డుపెట్టుకుని బిషప్ తప్పించుకోవడానికి చూస్తున్నాడని, అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారన్నారు. కొట్టాయంలో ఆదివారం పత్రికా సమావేశం నిర్వహించి తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment