సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతి పెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్ ఆజాద్‌పూర్ మండీ 24 గంటలపాటు పనిచేస్తుండడం రైతులకు ఆశాకిరణంగా మారింది. లాక్ డౌన్‌లో పరిమిత వేళలు పనిచేసిన ఈ మండీలో భౌతిక దూరం పాటించేందుకు, సరుకు వర్తకం సులువుగా సాగేలా, 24 గంటలు పనిచేసేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆజాద్‌పూర్ మార్కెట్ కమిటీ అధికారులు, స్థానిక జిల్లా యంత్రాంగంతో చర్చించి ఒప్పించారు. మంగళవారం ఈ మండీకి వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. లాక్ డౌన్ ఇబ్బందులపై చర్చించారు. క్రమంగా ట్రేడర్లు పంట కొనుగోలు చేస్తుండటంతో వాటి ధరలు కాస్త పుంజుకుంటున్నాయి. ఏప్రిల్ 16న టన్ను బత్తాయి సగటున రూ.16,500 పలకగా.. ఏప్రిల్ 20న అది రూ.2,463 లు పలికింది. ఏప్రిల్ 20న టన్ను బత్తాయి కనిష్టంగా రూ.9,000, గరిష్టంగా రూ.40 వేలు పలికింది.
పుంజుకున్న సరుకు రవాణా..
ఆజాద్‌పూర్ మండీని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 1977లో నిర్మించింది. 44 ఎకరాల విస్తీర్ణంలో 1,400కు పైగా హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. ఇక్కడ 4 వేల మంది కమీషన్ ఏజెంట్లు, హోల్‌సేల్ వ్యాపారులున్నారు. ఆపిల్, అరటి, నారింజ, మామిడి, బత్తాయి తదితర పండ్లకు అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. ఆలుగడ్డ, గోబీ, టమాట, ఉల్లి, వెల్లుల్లి, అల్లం తదితరాలకు మార్కెట్‌గా ఉంది. ఏటా 50 లక్షల టన్నుల పండ్లు, కూరగాయల అమ్మకాలు జరిగే ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్రభావానికి లోనైంది.
మార్చి 23 నాటికి దాదాపు రోజు సగటున 15 వేల టన్నుల పండ్లు, కూరగాయలు రవాణా కాగా.. మార్చి 24 తర్వాత ఇది సగానికిపైగా పడిపోయింది. మంత్రి జి.కిషన్‌రెడ్డి చర్యలతో రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు ట్రక్కులకు అనుమతి ఉంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు కొనసాగుతాయి.
తరలివస్తున్న పంటలు
ఏపీ నుంచి అరటి తదితర ఉద్యాన పంటలు, టమాట, ఉల్లి తదితరాలు, తెలంగాణ నుంచి బత్తాయి, మామిడి, కూరగాయలు సరఫరా అవుతాయి. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి దానిమ్మ, పుచ్చకాయ, ద్రాక్ష తదితరాలు వస్తాయి.
తెలుగు రైతుల అవసరాలు తీరుస్తుంది
‘తెలంగాణ బత్తాయి రైతుల అవసరాలు తీరుస్తుంది. ఏటా 30 వేల మెట్రిక్ టన్నుల పంట ఈ మండీకి వస్తుంది. ఏపీ నుంచి బత్తాయి, అరటి, మామిడి ఇక్కడికి రవాణా అవుతున్నాయి. జగిత్యాల నుంచి మామిడి, అనంతపురం నుంచి బత్తాయి మండికి వచ్చింది. ఉత్పత్తుల రవాణాకు ఆటంకం ఉండదు. అవాంతరాలు వస్తే 14488 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయొచ్చు.
– కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి
రైతులు తమ పంటను పంపొచ్చు
‘24 గంటల పాటు మార్కెట్ పనిచేస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి కూడా బత్తాయి, మామిడి, అరటి వంటి పంటలు వస్తున్నాయి. వలంటీర్ల వ్యవస్థ కూడా పనిచేస్తోంది..’అని ఆజాద్‌పూర్ మండీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆదిల్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
– ఆజాద్‌పూర్ మండీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆదిల్ అహ్మద్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment