సాక్షి, ముంబై: కొంకణ్ రైల్వే మార్గంలో గత నాలుగైదు రోజుల నుంచి వివిధ కారణాలవల్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే సాధారణ సమయానికి కంటే సుమారు రెట్టింపు సమయం పడుతోంది. దాదాపు 10 లేదా 12 గంటల్లో ముగించాల్సిన ప్రయాణానికి 24 గంటల సమయం పడుతుంది. దీంతో గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు బయలుదేరిన కొంకణ్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గణేష్ ఉత్సవాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఎమ్మెస్సార్టీసీ అదనంగా 3,500 బస్సులు నడుపుతోంది. వీటికి తోడుగా దాదాపు 150కి పైగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. దీన్ని బట్టి కొంకణ్ వైపు ప్రయాణికుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఒకపక్క ఈ మార్గంపై రెగ్యులర్‌గా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో క్రాసింగ్‌ల కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గత ఆదివారం కరంజాడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్‌రైలు పట్టాలు తప్పడంతో 500 మీటర్ల మేర రైల్వే లైన్ పూర్తిగా దెబ్బతింది. తాత్కాలికంగా స్లీపర్స్‌వేసి సోమవారం నుంచి రైళ్లను పునరుద్ధరించారు. కాని కరంజాడి స్టేషన్ సమీపంలో రైళ్ల వేగాన్ని నియంత్రించారు. మరోపక్క సెంట్ర ల్ రైల్వే హద్దు రోహా వరకు ఉంది. ఆ తర్వాత కొంకణ్ రైల్వే డివిజన్ ప్రారంభమవుతుంది. దీంతో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), దాదర్, లోక్‌మాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైళ్ల మోటార్ మెన్లు, గార్డులు రోహలో మారుతారు.
కాని 150కిపైగా అదనంగా నడుపుతున్న రైళ్ల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడుతోంది. కొంకణ్ రైల్వే, సెంట్రల్ రైల్వే మధ్య సమన్వయం లేకపోవడంవల్ల రెండు, మూడు గంటలపాటు రైళ్లు రోహాలోనే నిలిచిపోతున్నాయి. డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రారంభించిన మొదటిరోజే ఈ సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ఇలా అనేక కారణాలవల్ల కొంకణ్ రైళ్లు తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి.
దాదర్-సావంత్‌వాడి 12 గంటలు, రత్నగిరి-దాదర్ ఎనిమిది గంటలు, దీవా-సావంత్‌వాడి ఎనిమిది గంటలు, మాండ్వీ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు, నేత్రవతి ఎక్స్‌ప్రెస్ ఆరు గంటలు, జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ఎనిమిది గంటలు, గణేష్ ఉత్సవాల ప్రత్యేక రైళ్లు 12 గంటల చొప్పున ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు అన్ని రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టినట్లయితోంది. ఉత్సవాల కారణంగా ఇప్పటికే రైళ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి.
వెయిటింగ్ లిస్టు 500-800 ఉన్నప్పటికీ టెకెట్లు కొనుగోలుచేస్తున్నారు. అందులో కాలుపెట్టడానికి ఇంత చోటు దొరికితే చాలని అనుకుంటున్నారు. కాని రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రైల్వే సిగ్నల్ ఫెయిల్...
కొంకణ్ రైల్వే మార్గంలో విఘ్నాల పరంపర కొనసాగుతూనే ఉంది. కరంజాడీ స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం సిగ్నల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గత ఆదివారం ఇదే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటికీ రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి.
దీనికి తోడు సిగ్నల్ ఫెయిల్ కావడంతో కొంకణ్ రైల్వే పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా మారింది. కొన్ని ప్యాసెంజర్ రైళ్లను లూప్‌లైన్‌లోకి మళ్లించి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినప్పటికీ అప్,డౌన్ రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
కొంకణ్ రైళ్లు ఆలస్యం
Published Wed, Aug 27 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement