కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి! | Krishna water supply declared by krishna water board meeting | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి!

Published Fri, Jun 19 2015 2:28 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి! - Sakshi

కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి!

* 15 అంశాలతో మార్గదర్శకాల రూపకల్పన
* ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు
* మిగులు జలాలూ ఇదే నిష్పత్తిలో పంపిణీ

* నీటి విడుదల ప్రొటోకాల్ నిర్ధారణకు వర్కింగ్ గ్రూపు ఏర్పాటు
* దీని సిఫారసులకు అనుగుణంగానే బోర్డు ఆదేశాలు
* సుదీర్ఘంగా సాగిన కృష్ణా బోర్డు సమావేశం.. నేడూ కొనసాగింపు

 
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపిణీపై మార్గదర్శకాల ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది.  రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన 15 అంశాలపై ప్రస్తుతానికి ఒక ముసాయిదాను రూపొందించింది. దీనిని జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది. గురువారం ఇక్కడి శ్రమశక్తిభవన్‌లోని జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి అమర్‌జీత్‌సింగ్, తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్.కె.జోషి, ఆదిత్యనాథ్‌దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు, తెలంగాణ అంతర్ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజనీర్ నాగేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
విశ్వసనీయ సమాచారం మేరకు.. ముందుగా బోర్డు పరిధిని నిర్వచించి ఈ నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులను, వాటి నీటి విడుదల ప్రొటోకాల్‌ను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 8.40 వరకు.. దాదాపు 10 గంటల పాటు కొనసాగింది. వివిధ అంశాలపై సమావేశంలో వాడీవేడిగా వాదోపవాదాలు జరిగినప్పటికీ చివరకు సయోధ్య దిశగా అడుగులు వేశారు. సమావేశాన్ని శుక్రవారం కూడా కొనసాగించాలని, మరోసారి అన్ని అంశాల మీద చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు. ఈ ముసాయిదా ఆమోదం పొందితే 2015-16 ఖరీఫ్, రబీ పంటల కాలానికి మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించారు.
ముసాయిదాలోని ముఖ్యాంశాలు:
1. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల్లో నీటి విడుదల ప్రొటోకాల్ కూడా బోర్డు పరిధిలోకి వస్తుంది.
 2. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు మెంబర్ సెక్రెటరీ అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాజెక్టుల అధికారుల నుంచి  నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళ్లాలి. నీటి విడుదలకు అవసరమైన ఆపరేషన్ ప్రొటోకాల్‌ను సిఫారసు చేస్తుంది. ఇందుకు అనుగుణంగా కృష్ణా బోర్డు తగిన ఆదేశాలు జారీచేస్తుంది. వీటిని ఆయా ప్రాజెక్టు అధికారులు అమలుచేయాల్సి ఉంటుంది.
 3. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల జలాలను ఏపీ 512 , తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలి.
 4. నికర జలాలు 811 టీఎంసీలు పోగా మిగులు జలాలు ఉంటే వాటినీ అదే నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి.
 5. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి కుడి కాలువ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా 32 టీఎంసీలు విడుదల చేయాలి. ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు 100 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. మొత్తంగా నాగార్జునసాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలి.
 6. కెసీ కెనాల్ ద్వారా 31 టీఎంసీలు, జూరాల ద్వారా 17.8 టీఎంసీలు, ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీల నీటి వినియోగం మించకూడదు.
 7. తెలుగు గంగ ద్వారా చెన్నై నీటి పథకానికి నిర్దేశిత విడుదలయ్యేలా, ఎస్సార్బీసీ ద్వారా వివిధ అవసరాలకు 19 టీఎంసీలు తప్పనిసరిగా విడుదలయ్యేలా చూడాలి. వీటిని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి అంశాన్ని పరిగణించాలి.
 8. భీమా ఎత్తిపోతల పథకానికి 20 టీఎంసీలు ఇవ్వడం ద్వారా కృష్ణా డెల్టాకు తక్కువయ్యే 20 టీఎంసీల విషయంలో పాత విధానాన్నే పాటించాలని నిర్ణయించారు.
 9. నీటి నియంత్రణ, నిర్వహణలో ముందుగా కృష్ణా డెల్టా అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు అనుగుణంగా నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఉండాలి.
 
 వాదోపవాదాలు..
*  నికర జలాల పంపిణీకి సంబంధించి.. తమకు 532 టీఎంసీలు కేటాయించి, తెలంగాణకు 279 టీఎంసీలే కేటాయించాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు. చివరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలని నిర్ణయించారు. కృష్ణా డెల్టాకు తక్కువయ్యే 20 టీఎంసీల విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించారు.
*  హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇప్పుడు ఇస్తున్న 16.5 టీఎంసీలకు తోడుగా ఉమ్మడి నీటి కేటాయింపుల నుంచి మరికొంత నీరు కేటాయించాలని తెలంగాణ కోరగా.. నూతన రాజధాని అమరావతికి, రాయలసీమకు తాగునీటి అవసరాలకు నీరు కావాలని ఏపీ కోరింది. * ఈ అంశంపై ఇప్పటివరకు ఉన్న విధానాన్నే కొనసాగించాలని, హైదరాబాద్‌కు అవసరమైన నీటిని ఉమ్మడి కోటా నుంచి తీసుకోవాలని నిర్ణయించారు.
*  మొత్తం కేటాయింపుల నుంచి తమకు నచ్చిన రీతిలో వినియోగించుకుంటామని తెలంగాణ వాదించినప్పటికీ.. ఏపీ అంగీకరించలేదు. కేంద్రమూ ఈ వాదనకు సానుకూలంగా స్పందించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement