
ఆలయంలో వీరంగం చేస్తున్న మహిళ
సాక్షి, కర్ణాటక(తుమకూరు): దళితులు గుడిలో ప్రవేశించారనే కారణంగా ఓ మహిళ తన ఒంటిపై దేవత పూనినట్లు ఆవేశంతో ఊగి పోతూ ప్రజలను బెదిరించిన ఘటన సోమవారం జిల్లాలోని కుణిగల్ తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కెంకరమ్మ దేవాలయంలోని కెంకమ్మ జాతర సందర్భంగా సోమవారం గ్రామంలోని దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తులు కొంతమంది దేవాలయంలోకి ప్రవేశించి కెంకమ్మదేవిని దర్శించుకున్నారు. ఇది గమనించిన గ్రామస్థులు దళితులు దేవాలయంలోకి ప్రవేశించడంపై దళితులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న అగ్రకులానికి చెందిన మహిళ త్రిశూలాన్ని చేతిపట్టుకొని తనకు అమ్మవారు పూనినట్లు వీరంగం సృష్టించారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా దళితులు దేవాలయంలోకి ప్రవేశించి అపరాధం చేసారని అందుకు దళితులంతా వాంతులు, విరేచనాలతో మరణిస్తారంటూ శపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో దళితులు తమను అవమానించారని తమకు న్యాయం చేయాలంటూ దేవాలయం ఎదుట నిరసనలకు దిగారు.