'గీతా' గానం చిరస్మరణీయం!
ఓ ప్రత్యేకమైన హస్కీ వాయిస్ తో పాటలు పాడి లక్షలాది అభిమానులను సంపాదించుకున్న గాయని గీతాదత్. ఆమె మరణించడం ఎంతో విషాదకరం. ఆమె మృతిచెంది 44 సంవత్సరాలయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం చిరస్మరణీయం అంటూ గాన కోకిల లతామంగేష్కర్ గుర్తు చేసుకున్నారు. జూలై 19న గీతా మరణించిన రోజు కావడంతో ఆమెను ఎంతో మిస్ అయ్యాం అంటూ లతా తన జ్ఞాపకాలను ట్వీట్ లో పంచుకున్నారు.
గీతా దత్ ఎంతో మంచి గాయకురాలని, అభిమానుల మనసులో నిలిచిపోయిన 'హమ్ పంఛీ మస్తానే', 'అంకియాన్ భూల్ గయీహై సోనా', 'క్యా బతావూం మొహబ్బత్ హై క్యా' వంటి ఎన్నో యుగళ గీతాలను ఆమెతో కలసి పాడానని గీతా పుణ్యతిథిరోజున లతా మంగేష్కర్ గుర్తుకు తెచ్చుకున్నారు. గీతా లేకుండా 44 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఆమెను ఎంతో మిస్ అవుతున్న ఫీలింగ్ అంటూ లతా ట్వీట్ చేశారు. 1947 నుంచి దత్ తనకు ఎంతో మంచి స్నేహితురాలని లతా మంగేష్కర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం 86 ఏళ్ళున్న మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్.. 1959 లో విడుదలైన చిత్రం 'కాగజ్ కే ఫూల్' లో దత్ పాడిన పాట.. 'వక్త్ నే కియా క్యా హసీన్ సితాం' లింకు ను తన ట్వీట్ లో పోస్ట్ చేశారు.
గీతా దత్ జీవించినది 41 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో పాటలు పాడకపోయినా, పాడినవి మాత్రం అభిమానులు ఎన్నటికీ మరువలేనివే. ఒక్కసారి ఆమె గొంతు విన్నవారెవరూ మర్చిపోలేరు. 1930 నవంబర్ లో పుట్టిన గీతా దత్.. 1972 జూలైలో లివర్ సిరోసిస్ తో మరణించారు.