రిటర్నులపై ఆలస్య రుసుం రద్దు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రిటర్నులను గడువులోగా దాఖలు చేయని వారికి ఆలస్య రుసుమును రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దాఖలు చేసిన జీఎస్‌టీఆర్ 3బీ రిటర్నుల్లో ఉన్న లోపాలను సరిచేసుకుని ఫైనల్ రిటర్నులను దాఖలు చేసేందుకు వ్యాపారులకు ఐదో∙తేదీ వరకు గడువిచ్చింది.
జూలైకి సంబంధించిన తొలి జీఎస్‌టీ రిటర్నులను దాఖలు చేసి పన్నుల చెల్లింపును ఆగస్టు 25 నాటికి వ్యాపారులు పూర్తి చేయాలి. జూలై నెల అమ్మకాలకు సంబంధించిన తుది రిటర్నులను ఈ నెల 5వ తేదీ నాటికి కొనుగోళ్లకు సంబంధించిన రిటర్నులను ఈ నెల 10వ తేదీ నాటికి దాఖలు చేయాలి. జూలై నెలకుగానూ జీఎస్‌టీఆర్ 3బీ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులందరికీ ఆలస్య రుసుమును రద్దు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీని మాత్రం పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది.