ఎఫ్‌సీఐ తప్పుకుంటే ‘మద్దతు’ ఎలా?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే ఎన్డీయే ప్రభుత్వం రహస్య ఎజెండాతో ఎఫ్‌సీఐ పునర్ వ్యవస్థీకరణ, ఆహార ధాన్యాల సేకరణ అంశాలపై శాంతకుమార్ కమిటీని నియమించిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మోదీ ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని, దాని ఉదాత్తమైన ఉద్దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తోంది.
చట్టం కింద ఉన్న 67 శాతం లబ్ధిదారులను 40 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. భూసేకరణ చట్టాన్ని రైతు వ్యతిరేక చట్టంగా మార్చినట్టే, ఆహార భద్రత చట్టాన్ని పేదల వ్యతిరేక చట్టంగా మా ర్చుతున్నారన్నారు. జనతాపరివార్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో కూడా పునరేకీకరణ జరగాలని దిగ్విజయ్ అన్నారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలు.. కాంగ్రెస్ నుంచి వేరుపడి ఏర్పడిన ఇతర పార్టీలు అన్నీ తిరిగి కాంగ్రెస్‌లో ఐక్యం కావలసి న అవసరం ఉందని పేర్కొన్నారు.