లతా రజనీకాంత్
చెన్నై : దుకాణం అద్దె పెంపును వ్యతిరేకిస్తూ లతా రజనీకాంత్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిరాకరణకు గురైంది. నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తరఫున మోహన్ మేనన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ విధంగా తెలిపారు. లతా రజనీకాంత్‌కు ఆళ్వార్‌పేటలో కార్పొరేషన్ కేటాయించిన దుకాణం ఉందని, ఇందులో ట్రావెల్స్ సంస్థను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ దుకాణానికి గత జూన్ వరకు రూ.3,702 మాత్రమే అద్దె వసూలు చేస్తూ వచ్చారని, ఇలాఉండగా గత జూన్ 23వ తేదీ దుకాణం అద్దెను రూ.21,160గా చెన్నై కార్పొరేషన్ పెంచినట్లు తెలిపారు. ఇదివరకే పాతనోట్ల రద్దు ప్రకటించడం, జీఎస్టీ వంటి సమస్యలతో ట్రావెల్స్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
ఇటువంటి పరిస్థితిలో చెన్నై కార్పొరేషన్ అద్దెను పెంచడం తమకు భారంగా మారిందని, దీనిపై తాము కార్పొరేషన్‌కు విన్నవించుకున్నా, దీన్ని పరిశీలించలేదని తెలిపారు. అందువల్ల అద్దె పెంచుతూ కార్పొరేషన్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి వైద్యనాథన్ సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో నగర కార్పొరేషన్ తరఫున హాజరైన న్యాయవాది టీసీ గోపాలకృష్ణన్ వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జీవో 92ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు తోసిపుచ్చినట్లు వాదించారు. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి, లతా రజనీకాంత్ తరఫున దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment