తెలంగాణ సచివాలయాన్ని వాస్తుదోషం కారణంతో ఎర్రగడ్డకు తరలించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిందని, దానిని అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో పిటిషనర్ సరైన వివరాలు సేకరించకుండానే కోర్టును ఆశ్రయించారని, తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా విధించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ తరలింపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆప్ నేత మహ్మద్ హాజీ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. మంత్రిమండలి నోట్‌ఫైల్‌ను పరిశీలించి పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో ఎక్కడా కూడా వాస్తుదోషం కారణంగా సచివాలయాన్ని తరలిస్తున్నట్లు లేదని స్పష్టం చేసింది.