సాక్షి, బెంగళూరు : 'మీటూ' ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని మహిళలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వేధింపులపై ఫిర్యాదు చేసిన ఒక మహిళా న్యాయవాది పుష్ప అర్చనా లాల్ (26) అనుమానాస్పద రీతిలో శవమై తేలడం కలకలం రేపింది. లైంగిక వేధింపులకు సంబంధించి సీనియర్ న్యాయవాదులపై ఫిర్యాదు చేసిన రోజుల్లో వ్యవధిలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం అనేక అనుమానాలను తావిచ్చింది.
మల్లేశ్వరంలోని పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న గదిలో అర్చన అపస్మారక స్థితిలో వుండటాన్ని పనిమనిషి ముందుగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకోసం తరలించారు. అయితే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
అండమాన్ & నికోబార్ దీవులకు చెందిన అర్చనా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అనంతరం 2017లో బెంగళూరుకు వచ్చారు. స్థానిక జయంత్ పట్టాన్‌శెట్టి అసోసియేట్స్‌లో లా ఇంటర్న్‌గా జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు న్యాయవాది చంద్ర నాయక్ వద్ద తన ఇంటర్నషిప్‌ను మొదలుపెట్టారు. ఇక్కడే ఆమెకు వేధింపుల పర్వం మొదలైంది. ఆఫీసులో పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన చంద్ర నాయక్ ప్రభుత్వ న్యాయవాది చేతన్ దేశాయ్‌తో మరింత వేధింపులకు పాల్పడ్డారని అర్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు బలవంతంగా తనతో మద్యం తాగించి వేధింపులకు పాల్పడ్డారంటూ నవంబరు 20న వ్యాలికావల్ పోలీస్ స్టేషన్‌లో అర్చన ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన నాలుగురోజుల కాలంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.
అటు పేయింగ్ గెస్ట్ ఓనర్ కూడా అర్చన మరణంపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతికి, లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ, సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా పోలీసులను కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై జయంత్ పట్టన్‌శెట్టి అసోసియేట్స్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment