మీ ఇంటిని పేల్చేస్తాం...చంపేస్తాం
మీ ఇంటిని పేల్చేస్తాం...చంపేస్తాం
Published Fri, Jan 15 2016 2:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:44 PM
తిరువనంతపురం: శబరిమలై ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నన్యాయవాది నౌషాద్ అహ్మద్ ఖాన్ ని చంపేస్తామంటూ కొంతమంది హెచ్చరించడం కలకలం రేపింది. కొన్ని వందల కాల్స్ రావడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. భారత యువ లాయర్ల సంఘం అధ్యక్షుడు ఖాన్ ఈ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. పిటిషన్ వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఆయన శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తూ సుమారు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని నౌషాద్ ఇవాళ కోర్టుకు తెలిపారు. లేదంటే తమ ఇంటిని పేల్చి వేస్తామని, తనను మట్టుబెడతామని హెచ్చరించినట్టుగా సుప్రీంకు తెలియజేశారు. అందులో అమెరికా నుంచే ఎక్కువ కాల్స్ వచ్చినట్లు ఆ లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే లాయర్ తాజా పిటిషన్ను వి చారణకు స్వీకరించిన సుప్రీం సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఖాన్కు కల్పించాల్సిన రక్షణ తదితర విషయాలపై కోర్టు తన తీర్పును వెల్లడించనుంది.
అటు అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10-50 సం.రాల మహిళా భక్తుల ప్రవేశాన్ని నిషేధంపై ఇటీవల వివాదం రేగింది. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న సుప్రీం వివరణ ఇవ్వాలని శబరిమల అయ్యప్ప దేవాయలం ట్రస్ట్ ను కోరింది. జస్టిస్ దీపక్ మిశ్రా, ఎన్వి రమణలతో కూడిన ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.
కాగా కేరళలో ప్రముఖ అయ్యప్ప క్షేత్రం శబరిమలైలో కేవలం పదేళ్ల లోపు అమ్మాయిలను, 50 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఆలయంలో ప్రవేశించడానికి అనుమతిస్తారు. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది ఖాన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement