ప్రమాణస్వీకారానికి ముందే పొదుపు చర్యలు
కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయన్ మంత్రివర్గంలో మొత్తం 19 మంది సభ్యులుండే అవకాశం కనిపిస్తోంది. వీళ్లలో సీపీఎంతో పాటు భాగస్వామ్య పక్షాలైన సీపీఐ, ఎన్సీపీ సభ్యులు కూడా ఉంటారు. అత్యంత కీలకమైన హోం, విజిలెన్స్ శాఖలను విజయన్ తనవద్దే ఉంచుకున్నారు. సీపీఎం నుంచి ఈపీ జయరాజన్, థామస్ ఇజాక్, కేకే శైలజ, ఏకే బాలన్, టీపీ రామకృష్ణన్, జి సుధాకరన్, కడకంపల్లి సురేంద్రన్, సి.రవీంద్రనాథ్ తదితరుల పేర్లు మంత్రుల జాబితాకోసం వినిపిస్తున్నాయి.
పొదుపు చర్యలలో భాగంగా మంత్రుల అధికారిక నివాసాలకు ఎలాంటి మార్పుచేర్పులు చేయబోమని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ముందే ప్రకటించారు. అలాగే మంత్రుల వ్యక్తిగత సిబ్బంది సంఖ్యను కూడా 30 నుంచి 25కు తగ్గించారు. పాత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చేసినట్లుగా సీఎం కార్యాలయం, చాంబర్ నుంచి లైవ్ వెబ్‌స్ట్రీమింగ్ ఏమీ ఇవ్వబోమన్నారు.