
సముద్రంలో వెయ్యి నోట్లు కొట్టుకొచ్చాయి..
ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదుగానీ నదిలో వెయ్యి రూపాయల నోట్లు అలా తేలుకుంటూ పోతున్నాయి. దీంతో మత్స్యకారులు, కొంతమంది ఈతగాళ్లు అక్కడికి చేరుకున్నారు. తలా కొన్ని నోట్లను దొరకబుచ్చుకున్నారు.
ముంబై: కరెన్సీ నోట్లు చెట్లకు కాయవని, ఆకాశం నుంచి ఊడి పడవని అందరికీ తెలుసు.. కానీ కట్టలు కట్టలుగా డబ్బుల వర్షం కురిస్తే...కళ్లముందే నీళ్లలో అలా తేలుతూ పోతోంటే ... అదీ వెయ్యి రూపాయలు నోట్లు...ముంబై లోని గేట్ వే ఇండియా దగ్గర మంగళవారం సాయంత్రం అచ్చం ఇలాగే జరిగింది.
ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదుగానీ సముద్రంలో వెయ్యి రూపాయల నోట్లు అలా తేలుకుంటూ పోతున్నాయి. క్షణాల్లో ఈ విషయం దావానలంలా వ్యాపించింది. దీంతో మత్స్యకారులు, కొంతమంది ఈతగాళ్లు అక్కడికి చేరుకున్నారు. తలా కొన్ని నోట్లను దొరకబుచ్చుకున్నారు. అటు నది ఒడ్డున జనప్రవాహం, ఇటు నదిలో నీటి ప్రవాహం ఉధృతమైంది. దీంతో అక్కడి గుమిగూడినవారంతా చేసేదేమీ లేక అలా ఊసూరుమంటూ చూస్తూ ఉండియారు. మరికొంత మంది ఈ దశ్యాలను తమ తమ కెమెరాల్లో బంధించారు.
ఇంతలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. డబ్బుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న కొంతమంది వారించి, జనాన్ని చెదరగొట్టారు. అయితే ఆ నోట్లు ఎలా ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం ఎవరికీ అంతుబట్టడంలేదు. దొంగల బారినుంచి కాపాడుకోవడానికే ఒక ధనవంతుడు లక్షల కొద్దీ డబ్బులున్న సంచిని నదిలో విసిరేశాడనే కథనం మాత్రం ప్రచారంలో ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ముందు ఒక నోటు చూశాను... పెద్దగా పట్టించుకోలేదు.. కానీ వరుసగా చాలా నోట్లు కనిపించాయి..అంతే నదిలో దూకేశాను.. కానీ అన్ని డబ్బులు చూస్తోంటే... భలేగా ఉంది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు హరి సూరియా. అయితే కొన్ని నోట్లను దక్కించుకున్న మత్స్యకారులు ఈ డబ్బుతో పిల్లలకు మంచి తిండి పెడతామని, మసీదుకు విరాళంగా యివ్వనున్నామని ప్రకటించడం విశేషం.