సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మే 17 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ జారీచేసింది. అయితే లాక్‌డౌన్ సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి పరిస్ధితిని సమీక్షిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది.(తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే..)
కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్‌డౌన్ రెండో దశ ఏప్రిల్ 1న ప్రారంభమై మే3 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ మూడో దశ మే 4 నుంచి మే 17 వరకు ప్రకటించింది. దీంతో మొత్తం 56 రోజులు భారత్‌లో లాక్‌డౌన్ విధించినట్టయింది. అయితే మూడో దశలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు ఇచ్చారు.(ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే)
3వ దశ లాక్‌డౌన్ నిబంధనలు ఇవే..
►విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
►స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్
►హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్
►స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంచాలి
►అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు
►అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి
►గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
►రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు
►వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన
►కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు
►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
►గ్రీన్ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
►ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
►ఆరెంజ్ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
►ఆరెంజ్ జోన్లు: టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి
►ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్ క్యాబ్‌లకు అనుమతి
►వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి
►రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు
►33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి
►రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
►బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి
►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆన్ లైన్ షాపింగ్‌కు అనుమతి
►ప్రైవేట్ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి
►అన్ని రకాల గూడ్స్, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి
►బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే
►పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు
►అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి
►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి(ఆ జోన్లలో లిక్కర్ కిక్..)
►మద్యం షాపుల వద్ద ఐదుగురికి మించకుండా ఉండాలి
కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించిన విషయం తెలిసిందే. ఆ శాఖ రూపొందించిన పలు నియమ నిబంధనల మేరకు జిల్లాలను మూడు రకాల జోన్లుగా విభజించారు. రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లుగా విభజించి తదనుగుణంగా కొన్ని పరిమితులను విధించారు.
రెడ్ జోన్స్ (హాట్‌స్పాట్ జిల్లాలు) - కరోనా వైరస్‌కు సంబంధించి మొత్తం యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు రెండింతలుగా నమోదు కావడం, ఆయా ప్రాంతాల్లో జరిగిన పరీక్షలు, నిఘా వర్గాల సమాచారం మేరకు రెడ్ జోన్లను ప్రకటించారు. గ్రీన్ జోన్లు - గడిచిన 21 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్‌జోన్లుగా గుర్తించారు. ఇకపోతే, రెడ్, గ్రీన్ కానీ పరిస్థితులున్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. ఈ లెక్కన దేశ వ్యాప్తంగా 733 జిల్లాలను ఆయా జోన్ల కింద విభజించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తీరు, పాజిటివ్ కేసులు నమోదు వంటి ప్రక్రియల ఆధారంగా 130 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. అలాగే 284 ఆరెంజ్ జోన్‌లోకి రాగా 319 జిల్లాలు గ్రీన్ జోన్‌లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment