న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను సడలిస్తూ కేరళ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం సీరియస్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్లు, బుక్ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు.(లాక్‌డౌన్: కేరళ కీలక ఆదేశాలు.. సడలింపులు ఇవే)
‘‘ఏప్రిల్ 15,2020న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం ఉల్లంఘించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జారీ చేసిన నిబంధనలను పాటించకుండా కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వివిధ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినిస్తూ ఆదేశాలు ఇచ్చింది’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పినరయి విజయన్ సర్కారు తీరును విమర్శించాయి. ఇక కేంద్రం లేఖపై స్పందించిన కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ... ‘‘ కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే లాక్‌డౌన్ నిబంధనలు సడలించాం. అపార్థాలు చోటుచేసుకున్నందు వల్లే ఇలా జరిగింది. అందుకే కేంద్రం వివరణ కోరింది. ఇందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వివరణ ఇచ్చిన తర్వాత సమస్య సమసిపోతుంది. కేంద్ర నిబంధనలనే మేం కచ్చితంగా అమలు చేస్తున్నాం’’అని స్పష్టం చేశారు.(లాక్‌డౌన్ : పాటించాల్సిన కొత్త రూల్స్)
కాగా లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాసర్‌గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్... పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్ ఏ జోన్... ఆరెంజ్ బీ జోన్‌లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, వయనాడ్, త్రిసూర్ జిల్లాలు... కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్ జోన్ కింద పరిగణిస్తూ కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment