ఇంజన్లో స్క్రూ లూజ్.. వెనుదిరిగిన విమానం
విమానం ఇంజన్లో ఓస్క్రూ లూజ్ అయ్యింది. అయితే సకాలంలో లోపాన్ని గుర్తించి, విమానాన్ని వెనక్కి తిప్పడంతో దాదాపు 175 మంది ప్రయాణికులకు ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. ఎస్జి-451 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఇంజన్లో సమస్యను గుర్తించిన పైలట్.. దాన్ని సింగిల్ ఇంజన్తోనే సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేశారు.
మొదటి ఇంజన్లోని ఫ్యూయెల్ పంపును ముందురోజు రాత్రి మరమ్మతు చేశారని, ఆ తర్వాత దానికున్న నాలుగు స్క్రూలలో ఒకదాన్ని సరిగ్గా బిగించలేదని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. దాంతో ఆ విమానానికి మెయింటెనెన్స్ ఇంజనీర్గా వ్యవహరించి, సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తికి అధికారాలను డీజీసీఏ తొలగించింది.
ఢిల్లీ నుంచి ముంబై బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, దాంతో విమానాన్ని వెనక్కి తిప్పి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశామని, తర్వాత వేరే విమానాల్లో వారిని పంపామని స్పైస్జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.