
విశాఖ ప్రమాదంపై రక్షణ మంత్రి సీరియస్!
విశాఖపట్నం తీరంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌక మునిగిపోవడం, అందులో ఐదుగురు సిబ్బంది మునిగిపోవడంపై మరింత సమగ్ర విచారణ జరిపించాలని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ఆదేశించారు.
విశాఖపట్నం తీరంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌక మునిగిపోవడం, అందులో ఐదుగురు సిబ్బంది మునిగిపోవడంపై మరింత సమగ్ర విచారణ జరిపించాలని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ఆదేశించారు. ఈ సంఘటనను ఆయన సీరియస్గా తీసుకున్నారు. ఐదుగురు నౌకాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, నౌక మునిగిపోవడాన్ని ఏమాత్రం అంగీకరించేది లేదని ఆయన చెప్పారు. వాస్కోలో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఆ నౌకను బయటకు తీసి మళ్లీ జలాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఉందేమో పరిశీలించాల్సిందిగా కూడా తాను ఆదేశించానన్నారు. స్వచ్ఛమైన ఇమేజి ఉన్నంత మాత్రాన సరిపోదని, వెంటవెంటనే సమయానికి తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇలాంటి రంగాల్లో అత్యవసరమని యూపీఏ హయాంలో రక్షణమంత్రిగా పనిచేసిన ఏకే ఆంటోనీని ఆయన విమర్శించారు. గత ఏడెనిమిదేళ్లుగా రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన అనేక విషయాలు పెండింగులోనే ఉండిపోయాయని విమర్శించారు.