
మధ్యప్రదేశ్‌లో గురువుల దారుణం..
భోపాల్: ప్రపంచమంతా అభివృద్ధి, ఆధునికత అంటూ పరుగులు పెడుతున్నా కొందరి మనస్తత్వాలు మారడం లేదు. వారిని పట్టుకున్న కులజాడ్యం వీడటం లేదు. ఏళ్లుగా పాతుకుపోయిన కులాల పిచ్చి మనిషిని గుర్తించకుండా చేస్తోంది. ఇలా నిరక్షరాస్యులు చేశారంటే లోకజ్ఞానం ఎక్కువగా లేదనుకోవచ్చు.. కానీ సాక్షాత్తు పాఠాలు చెప్పే గురువులే చేస్తే.. మధ్యప్రదేశ్లో ఇదే జరిగింది. దామోహ్లో దారుణం చోటుచేసుకుంది.
మంచినీటికోసం స్కూళ్లో చేతిపంపు వద్దకు వెళ్లిన ఓ దళిత బాలుడిని అందుకు అనుమతించకపోవడంతో అతడు బావిలో పడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల బాలుడు దాహార్తితో స్కూళ్లోని చేతిపంపు వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ అతడిని మంచినీళ్లు తాగేందుకు టీచర్లు అనుమతించకపోవడంతో పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లాడు. నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపట్ల సీరియస్ గా స్పందించిన ఉన్నతాధికారులు ఆ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసి విచారణ ఆదేశించారు.