అప్రతిహతంగా మోదీ హవా | Maharashtra and Haryana Assembly Polls 2014 | Sakshi
Sakshi News home page

అప్రతిహతంగా మోదీ హవా

Published Mon, Oct 20 2014 1:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

అప్రతిహతంగా మోదీ హవా - Sakshi

అప్రతిహతంగా మోదీ హవా

బలమైన నాయకులు, సంస్థాగత నిర్మాణం లేకున్నా.. బీజేపీ అద్భుత విజయాలు
మహారాష్ట్రలో పాతికేళ్ల పొత్తును పక్కనబెట్టి.. ఒంటరి పోరుతో అద్భుత విజయం
హర్యానాలో ప్రస్తుతం 4 సీట్లున్న పార్టీ.. ఏకంగా 47 సీట్ల గెలుపుతో కొత్త చరిత్ర

 
న్యూఢిల్లీ: ఐదు నెలల కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తొలిసారి సంపూర్ణ మెజారిటీ సాధించిపెట్టిన నరేంద్ర మోదీ హవా ఇంకా కొనసాగుతోందని తాజాగా మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు స్పష్టంచేశాయి. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోదీ చరిష్మా అనతి కాలంలోనే ఆవిరైపోతుందన్న చాలా మంది రాజకీయ పండితుల అంచనాలు తప్పని రుజువుచేశాయి. ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన ఐదు నెలల లోపే మోదీ తన పార్టీ వ్యవస్థాగత పునాదిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. పశ్చిమ, ఉత్తర భారతాల్లో కోటలు బద్దలు కొట్టి బీజేపీ పాగా వేసింది. హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల పొత్తులు, రాజకీయ మిత్రులను పక్కనబెట్టి ఒంటరిగా పోటీ చేసిన కమలదళం.. కాంగ్రెస్ నుంచి మరో రెండు రాష్ట్రాలను కొల్లగొట్టింది. దేశ రాజధానికి అతి సమీపంగానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. భారత ఆర్థిక రాజధాని గల మహారాష్ట్ర ఎన్నికల్లో తొలిసారిగా అతి పెద్ద పార్టీగా అవతరించటమే కాదు.. పాతికేళ్లలో రాష్ట్రంలో 100 సీట్ల మార్కును దాటిన ఏకైక పార్టీగా రికార్డు సృష్టించింది. ఏ పార్టీ సాయంతో అధికారం స్వీకరిస్తుందన్నది ప్రస్తుతానికి సందిగ్ధంగానే ఉన్నా.. అధికారాన్ని మాత్రం ఖాయం చేసుకుంది. ఈ విజయాలు మోదీ హవా వల్లే సాధ్యమయ్యాయన్నది ఆ పార్టీ నేతలే కాదు.. ప్రత్యర్థులు, రాజకీయ పండితులు అంగీకరిస్తున్న విషయం. ఈ విజయంలో బీజేపీ సారథిగా ఉన్న మోదీ అనుయాయి అమిత్‌షా కూడా.. సాహసోపేత నిర్ణయాలు తీసుకుని, ఫలితం రాబట్టడం ద్వారా తన వంతు పాత్ర పోషించారు.

‘మోదీ కే సాథ్’ మాటను నమ్మిన జనం... మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ గెలుపు.. ఆ పార్టీకి స్థానికంగా సరైన, సమర్థుడైన నాయకుడు ఉన్నాడా లేదా అన్నది ఓటర్లు పట్టించుకోలేదని చూపుతోందని.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి పోలైన ఓట్లు.. ఆ పార్టీకి వాస్తవంగా ఉన్న బలం కన్నా చాలా చాలా ఎక్కువని పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి మహారాష్ట్ర, హర్యానాల్లో తన ప్రత్యర్థి పార్టీలతో పోలిస్తే.. బీజేపీకి బలమైన నాయకుడు కానీ, చరిష్మా గల నాయకుడు కానీ, పార్టీ సంస్థాగత నిర్మాణం కానీ లేవు. అయినా.. ‘చలో చలే మోదీ కే సాథ్’ అన్న బీజేపీ ఎన్నికల నినాదాన్ని ఓటర్లు విశ్వసించారని.. మోదీ చెప్పిన మాటలను నమ్మారని.. అందుకే బీజేపీని అంతగా ఆదరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పాతికేళ్ల మిత్రుడిని పక్కనబెట్టి... మహారాష్ట్రలో సైతం నిన్నటివరకూ శివసేనకు జూనియర్ మిత్రపక్షంగానే మనుగడ సాగించిన బీజేపీ.. నేడు ఆ పార్టీని కాదని ఒంటరిగా పోటీ చేసి.. 122 సీట్లు (మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో) గెలుచుకుని.. గత రెండున్నర దశాబ్దాల్లో ఏ పార్టీ సాధించలేకపోయిన ఘన విజయం సాధించటానికి కూడా మోదీ హవాయే కారణమంటున్నారు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు చర్చల సందర్భంగా.. బీజేపీకి ఇస్తామని శివసేన ప్రతిపాదించిన సీట్లతో సమానమైన సంఖ్య ఇది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా.. ఆ పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించి తన పెద్దన్న పాత్రను వదులుకోవటానికి శివసేన ససేమిరా ఇష్టపడకపోవటంతో.. ఈ రెండు పార్టీల మధ్య రెండున్నర దశాబ్దాల పొత్తు విచ్ఛిన్నమైంది. రాజకీయ వాతావరణం మారిందన్న బీజేపీ.. మరాఠా బరిలో ఒంటరి పోరుకు దిగి.. సత్తా చాటింది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలుపు అద్భుతమైనదని.. ప్రస్తుత శాసనసభలో కేవలం 4 సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 12 రెట్లు అధికంగా 47 సీట్లు (మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో) గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకోవటం మోదీ హవాకు అద్దం పడుతోందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

2005 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుచుకున్న స్థానాలు కేవలం రెండంటే రెండు. ఈ రెండు రాష్ట్రాల్లో మోదీ 40 బహిసభల్లో  ప్రసంగించారు. కాగా, హర్యానా, మహారాష్ట్రల్లో గెలుపుతో బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య ఏడుకు పెరిగింది. మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్న రాష్ట్రాలను (ఏపీ, పంజాబ్) కూడా కలిపితే 9కి చేరుతుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఇప్పుడిక దేశ రాధాని రాష్ట్రమైన ఢిల్లీతోపాటు కాశ్మీర్‌పై గురి పెడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement