
ప్రయాణికుల భద్రతకే పెద్దపీట
రైల్వేబడ్జెట్‌లో ప్రయాణికుల భద్రతను పెంచే పలునిర్ణయాలను ప్రకటించే అవకాశముంది.
రైల్వే బడ్జెట్‌లో దీనికే ప్రాధాన్యం!
న్యూఢిల్లీ: రేపు ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికుల భద్రతను పెంచే పలు నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది. రైలు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో.. రైళ్లలోని పాడైపోయిన, వదులైపోయిన పరికరాలను గుర్తించేందుకు ట్రాకుల వెంట పలు ప్రాంతాల్లో ఎక్స్‌రే వ్యవస్థను ఏర్పాటు చేయడం అందులో ఒకటి. ప్రధాని నరేంద్రమోడీ టీంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సదానంద గౌడ ప్రయాణికుల భద్రతే తమ ప్రాథమ్యమని పలుమార్లు స్పష్టం చేశారు. అందులో భాగంగా కకోద్కర్ కమిటీ సిఫారసుల అమలు విషయంపై కూడా ఆయన తీవ్రంగా యోచిస్తున్నారు.
బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశమున్న మరికొన్ని అంశాలు..
* రైల్వే పోలీస్ ఫోర్స్ సిబ్బందికి అధునాతన శిక్షణ అందించేందుకు కొత్తగా అకాడమీ ఏర్పాటు. అన్ని ఆర్‌పీఎఫ్ పోస్ట్‌లను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన ‘రైల్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ ఏర్పాటు
* గార్డుల పహారా లేని లెవెల్ క్రాసింగ్‌లను దశలవారీగా తొలగించడం. ఇందుకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశం ఉంది.
* పతికూల వాతావరణం వల్ల తలెత్తే రైళ్ల ఆలస్యాన్ని నివారించే లక్ష్యంతో అధునాతన పరికరాలను సమకూర్చుకోవడం.
* సమస్యాత్మక రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, లగేజీల సత్వర క్లియరెన్స్ కోసం ఎక్స్‌రే యంత్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం
* ఇప్పటివరకు 202 రైల్వే స్టేషన్లను సున్నితమైన స్టేషన్లుగా గుర్తించగా వాటిలో 93 స్టేషన్లలోనే అధునాతన భద్రత వ్యవస్థ ఉంది.
‘కీలక రైల్వే విభాగాల్లో ఎఫ్‌డీఐలు వద్దు’
న్యూఢిల్లీ: రైల్వేల్లోని అత్యంత కీలక విభాగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలన్న ప్రతిపాదనపై హోం శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హైస్పీడ్ రైళ్లు, ప్రత్యేక రవాణ లైన్ల వంటి విభాగాల్లో 100% ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదనను హోంశాఖ వ్యతిరేకిస్తోంది. అలాంటి నిర్ణయం దేశంలోనే పెద్దదైన రవాణ వ్యవస్థ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించవచ్చంది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న రైల్వే శాఖకు జవసత్వాలు కల్పించాలనే ఉద్దేశంతో వాణిజ్య, పరిశ్రమల శాఖ రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనను ముందుకుతెచ్చింది.