
కోల్‌కతా : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏఐఎంఐఎం పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏఐఎంఐఎంను అతివాద పార్టీగా ఆమె అభివర్ణించారు. ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు.అలాగే హిందూ అతివాద శక్తుల పట్ల ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
2011 నుంచి పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు జరుపుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం.
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ.. మమత ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. బెంగాల్‌లో ముస్లింల పరిస్ధితి అత్యంత దారుణంగా ఉంది. బెంగాల్‌లో మేం బీజేపీకి 'బీ టీం' అనడం పూర్తిగా అర్థరహితమన్నారు. మమతా బెనర్జీ భయంతోనే అలా మాట్లాడుతున్నారు. బెంగాల్‌లో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు ఒవైసీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment