ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: గొంతును శుభ్రం చేసుకుంటున్న ఓ వ్యక్తి అనుకోకుండా టూత్‌బ్రష్‌ను మింగేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది జరిగిన రెండు రోజలు తరువాత ఆ వ్యక్తికి ఎండోస్కోపీ నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు 12 సెం.మీల పొడువున్న బ్రష్‌ను అతని పొత్తికడుపు పై భాగం నుంచి బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సీమాపూరిలో నివాసం ఉంటున్న అవిద్ గతేడాది డిసెంబర్ 8వ తేదీన టూత్‌బ్రష్‌తో గొంతును బాగా శుభ్రం చేయాలని ప్రయత్నిస్తుండగా బ్రష్ గొంతు లోనికి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అవిద్ తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ ఓ ఆస్పత్రికి వెళ్లారు. అవిద్ అసలు విషయం చెప్పకపోవడంతో వైద్యులకు అతని కడుపు నొప్పికి గల కారణాలు తెలియలేదు. దీంతో వైద్యులు అతనికి సీటీ స్కాన్ నిర్వహించారు. అందులో అవిద్ కడుపులో ఏదో వస్తువు ఉన్నట్టు తెలింది. అప్పుడు అవిద్ వైద్యులకు అసలు విషయం చెప్పారు.
బ్రష్‌ను బయటకు తీయడానికి ఆ ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వైద్యులు అవిద్ సమస్యను ఏయిమ్స్‌కు రిఫర్ చేశారు. అవిద్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు అతని ఉదరభాగంలో టూత్‌బ్రష్ చిక్కుకుని ఉందని.. అది గొంతు లోపలి ఇతర భాగాలకు ఎటువంటి హాని చేయలేదని తేల్చారు. డిసెంబర్ 10వ తేదీన అతని పొత్తికడుపు పైభాగంలో చిక్కుకున్న టూత్‌బ్రష్‌ను ఎండోస్కోపి చికిత్స ద్వారా బయటకు తీశారు. ఈ ఘటనపై ఎయిమ్స్ వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. చాలా మంది గొంతును శుభ్రం చేసుకోవడానికి టూత్‌బ్రష్ వాడతారని.. కానీ అలా చేయడానికి టంగ్ క్లీనర్ వాడటం మంచిదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment