లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ట్రిపుల్ తలాక్-2019 చట్టం కింద కేసు నమోదైంది. వరకట్నం ఇవ్వడం లేదని ఓ వ్యక్తి భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అత్తింటివారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కోసి ప్రాంతానికి చెందిన జుమిరాత్, మేవత్‌కు చెందిన ఇక్రమ్‌కు కొద్దినెలల క్రితం వివాహమైంది. అయితే, కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో గురువారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వరకట్నం కింద లక్ష రూపాయలు చెల్లిస్తేనే జుమిరాత్‌ను ఏలుకుంటానని ఇక్రమ్ తేల్చిచెప్పాడు.
(చదవండి : తలాక్ తలాక్ తలాక్ అంటే.. ఇకపై నేరమే)
అత్తింటివారు నిరాకరించడంతో.. నడిరోడ్డుపైనే మూడుసార్లు తలాక్ చెప్పాడు. భార్యతో తనకు ఏ సంబంధం లేదని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కాగా, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం ఇక్రమ్‌పై కేసు నమోదు చేశామని మథుర ఎస్పీ షాలాబ్ మాథుర్ చెప్పారు. ఈ చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ క్రిమినల్ చర్యగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయిన పక్షంలో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment