
సాక్షి, బెంగళూరు: ఎనిమిది నెలలుగా పెన్షన్ కోసం ఎదురుచూపులు. అడిగితే.. అధికారులు పట్టించుకోవట్లేదు. ఓపిక నశించి.. విసిగి వేసారిన ఆ పెద్దాయన వినూత్న రీతిలో నిరసన తెలిపి మీడియా దృష్టిని ఆకర్షించారు. గాద్గాలోని రోన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...
మాను సాబ రాజేఖాన్(68) కుష్టు వ్యాధిగ్రస్తుడు. గత ఎనిమిది నెలలుగా ఆయనకు రావాల్సిన పింఛన్ అందట్లేదు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారిని ఆరాతీయగా.. అసలు అధికారులే మంజూరు చేయలేదని తేల్చి చెప్పారు. దీంతో పెన్షన్ ఆఫీస్ చుట్టూ నెలల తరబడి తిరిగినా లాభం లేకపోయింది. కడుపు మండిపోయిన మాను.. గురువారం ఓ పెద్ద పామును మీదేసుకుని సరాసరి ఆఫీస్ లోపలికి వెళ్లారు. అది చూసి అధికారులు బిత్తరపోయారు.
‘పని చేసే ఒపిక లేదు. నేనేం తినాలి’ అంటూ రాజేఖాన్ అధికారులను నిలదీశారు. మెడలో పామును చూసి అధికారులు కాసేపు వణికిపోయారు. కొందరైతే ఏకంగా బయటకు పరుగులు తీశారు. చివరకు 3-4 రోజుల్లో పెన్షన్ సొమ్ము అందేలా చూస్తానని ఓ ఉన్నతాధికారి హామీ ఇవ్వటంతో ఆయన పామును విడిచిపెట్టారు. ఆ వీడియోను మీరూ చూడండి...