ముంబై : ప్రధాని మోదీ పాల్గొన్న ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రత్యేక ఎపిసోడ్ రికార్డు స్థాయిలో 36.9 లక్షల ప్రభావాలను (ఇంప్రెషన్స్) నమోదు చేసిందని డిస్కవరీ చానెల్ తెలిపింది. కార్యక్రమాన్ని ఎంత మంది, ఎంతసేపు చూశారో చెప్పేదే ఇంప్రెషన్. డిస్కవరీ చానెల్‌లో వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో ఎప్పుడూ సాహసాలు చేస్తూ కనిపించే బేర్ గ్రిల్స్ గురించి అందరికీ తెలిసిందే. మోదీతో కలిసి బేర్ గ్రిల్స్ నటించిన ప్రత్యేక ఎపిసోడ్ ఈ నెల 12న రాత్రి 9 గంటలకు ప్రసారమైంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయపార్కులో ఈ ఎపిసోడ్‌లోని దృశ్యాలను చిత్రీకరించారు. మోదీ పాల్గొన్న ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చిందనీ, వినోదంతో కూడిన సమాచార కార్యక్రమాల్లో (ఇన్ఫోటైన్‌మెంట్) ఇప్పటి వరకు అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమం ఇదేనని డిస్కవరీ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్‌సీ) ఇచ్చిన లెక్కల ఆధారంగా డిస్కవరీ ఈ ప్రకటన చేసింది. ఆగస్టు 12న తొలిసారి ప్రసారమైన కార్యక్రమం, ఆ తర్వాత పునఃప్రసారాలు, మళ్లీ దూరదర్శన్ నేషనల్‌లో ప్రసారమైనప్పుడు.. అన్నీ కలిపి 4.27 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని చూశారనీ, ఎపిసోడ్ సక్సెస్‌కావడంతో ఇండియాలో పులుల సంరక్షణకు తాము కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు డిస్కవరీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment