న్యూ ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై షూ విసిరిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. గతవారం ఢిల్లీలో ట్రాఫిక్ యాజమాన్య నిర్వహణలో భాగంగా సరిబేసి సంఖ్యల పద్ధతి అమలుపై కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై సదరు నిందితుడు బెయిల్ కోరగా నిరాకరించిన కోర్టు రెండువారాలపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
నిందితుడు వేద ప్రకాష్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా తోసిపుచ్చారు. ప్రజలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని, ఇందుకు ప్రతిబంధకంగా శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చారు. సరి బేసి సంఖ్య పథకం కోసం ఢిల్లీలో నకిలీ సీఎన్జీ స్టిక్కర్లు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్త వేద్ ప్రకాష్... కేజ్రీవాల్ పైకి షూ విసిరాడు. అయితే అది ఆయనకు తగలకుండా తృటిలో తప్పింది. సీఎన్జీతో నడుస్తున్న కార్లకు పథకంనుంచి మినహాయింపు ఇచ్చారని, అటువంటి 'స్కామ్' వీడియో ఆధారాలు తనవద్ద ఉన్నాయని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోపోవడంతోనే తనకు కేజ్రీవాల్ పై కోపం వచ్చి..షూ విసిరానని నిందితుడు చెప్తున్నాడు.
ఒకరోజు కస్టడీ ముగిసిన అనంతరం నిందితుడ్ని కోర్టుకు హాజరు పరచడంతో.. నిందితుడి బెయిల్ పిటిషన్ ను కోర్టు పరిశీలించింది. ఇతరుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చని, ప్రజలు ఎన్నుకున్నముఖ్యమంత్రిని, రాజ్యాంగాధికారాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న కోర్టు... ఇటువంటి చర్యలతో అసంతృప్తిని వ్యక్త పరచడం సరికాదని అభిప్రాయ పడింది.
షూ విసిరిన వ్యక్తికి 14 రోజుల కస్టడీ
Published Mon, Apr 11 2016 9:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM
Advertisement
Advertisement