
క్యాబ్‌ల ఘోరం: 70 కిలోమీటర్లకు రూ. 15వేల చార్జీ!
పర్యాటక ప్రాంతమైన మనాలిలో టాక్సీలు ఎక్కువగా లేకపోవడంతో.. వాళ్ల పని ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిపోతోంది. కేవలం 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్హి అనే ప్రాంతానికి వెళ్లి వచ్చేందుకు ఏకంగా రూ. 15వేలు చార్జి చేశారు. వాస్తవానికి టాక్సీ రకాన్ని బట్టి అక్కడకు వెళ్లి, తిరిగి రావాలంటే (రౌండ్ ట్రిప్) రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు మాత్రమే అవుతుంది. అయితే క్యాబ్ డ్రైవర్లు మాత్రం కిలోమీటరు చార్జీలతో సంబంధం లేకుండా రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకు ఎంత పడితే అంత వసూలు చేస్తున్నారు. ఎస్‌యూవీలలో అయితే ఒక్కో వాహనంలో 8 మందిని ఎక్కించుకుని ఒక్కొక్కరి నుంచి రూ. 1500 చొప్పున తీసుకుంటున్నారు. 11 నుంచి 14 మంది వరకు ప్రయాణికులు పట్టే టెంపోలలో అయితే ఒక్కొక్కరి వద్ద రూ. 1000 నుంచి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇంత ఎక్కువ చార్జీలు పెడితే ఎలాగని ప్రశ్నిస్తుండగా, మరికొందరు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లు అడిగినంత ఇచ్చేస్తున్నారు.
అయితే, ప్రయాణికుల వల్లే టాక్సీ రేట్లు పెరిగాయని, వాళ్లు ఇవ్వబట్టే తాము తీసుకుంటున్నామని ఒక టాక్సీ డ్రైవర్ చెప్పాడు. కావల్సిన దానికంటే టాక్సీల సంఖ్య బాగా తక్కువ ఉండటమే ఇందుకు కారణమన్నాడు. ఇక్కడివాళ్లను చూసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టాక్సీ డ్రైవర్లు కూడా ఇదే తంతు మొదలుపెట్టారు. పర్మిట్ ఉంటే చాలు.. టూరిస్టుల నుంచి పెద్దమొత్తంలో దోచేస్తున్నారు. కొద్ది మంది మాత్రం సరైన ధరలనే తీసుకుంటున్నారు. మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో కేవలం 1200 వాహనాలకు మాత్రమే ఆన్‌లైన్‌లో పర్మిట్లు లభ్యమవుతాయి. ఆరోజు అసలు ఏ వాహనాన్నీ రోడ్లమీదకు అనుమతించరు. పర్మిట్ వచ్చిన డ్రైవర్లు వాళ్ల టాక్సీలలో ఎక్కువ రేట్లు వసూలు చేస్తారు. మామూలుగా ఆన్‌లైన్‌లో పర్మిట్ తీసుకుంటే రూ. 550 మాత్రమే అవుతున్నా, ఏజెంట్లు కూడా వీటిని రూ. 1000, రూ. 1500 చొప్పున బ్లాక్‌లో అమ్ముతున్నారు.