న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న దేశ యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, వారి ఓట్లు నవ భారతానికి పునాది కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ ఏడాది ‘మన్ కీ బాత్’ చివరి కార్యక్రమంలో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ... ఆగస్టు 15 సమయంలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన యువ ప్రతినిధులతో ఢిల్లీలో మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేసి.. నవ భారత నిర్మాణంపై మేధోమథనం చేయాలని మోదీ సూచించారు. కొత్త సంవత్సరంలో ప్రజలు ప్రగతి శీల భారతదేశం కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు పరీక్షలో ప్రథముడిగా నిలిచిన అజుమ్ బషీర్ ఖాన్ ఖట్టక్ స్ఫూర్తి కథనాన్ని అందరూ స్మరించుకోవాలని ప్రధాని అభిలషించారు.
మన్ కీ బాత్‌లోని ముఖ్యాంశాలు
2000వ సంవత్సరంలో పుట్టిన వారు జనవరి 1 , 2018 నుంచి కొత్త ఓటర్లుగా నమోదుకు అర్హులవుతారు. 21వ శతాబ్దం ఓటర్లకు భారత ప్రజాస్వామ్యం స్వాగతం పలుకుతోంది. వారిని నేను అభినందించడంతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఓట్లు నవ భారతానికి ఆధారం. కులతత్వం, మతతత్వం, ఉగ్రవాదం, అవినీతి నుంచి మీరు నిర్మించే నవ భారతం విముక్తి పొందాలి. నవ భారతంలో అందరికీ సమానమైన అవకాశాలు దక్కడంతో పాటు వారి ఆశలు, ఆకాంక్షలు తీరాలి. దేశంలోని ప్రతి జిల్లాలో మాక్ పార్లమెంటును ప్రారంభిద్దామా? 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత నవ భారతంపై అందులో మేథోమధనం చేయాలి. ఆగస్టు 15 సమయంలో .. ఢిల్లీలో నిర్వహించే మాక్ పార్లమెంటులో ప్రతి జిల్లా నుంచి ఎంపికైన యువత పాల్గొని, రాబోయే ఐదేళ్లలో మన సంకల్పాల్ని సాకారం చేసుకునేందుకు ఏం చేయాలన్న అంశాలపై చర్చించాలని ఆకాంక్షిస్తున్నాను.
అంజుమ్ గాథ అందరికీ స్ఫూర్తి
కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ పరీక్షల్లో ప్రథముడిగా నిలిచిన అంజుమ్ బశీర్ ఖాన్ ఖట్టక్ స్ఫూర్తి గాథ ఇటీవలే తెలిసింది. అతను కశ్మీర్‌లోని ఉగ్రవాదం, విద్వేష కోరల నుంచి బయటపడి తన లక్ష్యాన్ని సాధించాడు. 1990లో అతని పూర్వీకుల ఇంటిని ఉగ్రవాదులు తగులబెట్టారు. ఉగ్రవాదం, హింస వల్ల అంజుమ్ కుటుంబం స్వగ్రామం వదిలి వెళ్లిపోయింది. అతను మాత్రం ప్రజలకు సేవ చేయాలన్న మార్గంలో ముందుకు సాగాడు.
ముస్లిం మహిళల పోరాటం ఫలించింది
ఈ ఏడాది జనవరి 4 నుంచి మార్చి 10 వరకు ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛతా సర్వేను నిర్వహించబోతున్నాం. 4 వేల నగరాల్లో 40 కోట్ల మందిని సర్వే చేయనున్నాం. 2018 గణతంత్ర వేడుకలకు ఆసియా దేశాలకు చెందిన పది మంది అధినేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారని మన్ కీ బాత్‌లో ప్రధాని తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం అనంతరం ప్రధాని తొలిసారి స్పందించారు. కేరళలోని శివగిరి మఠం యాత్రికుల ఉత్సవాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. ‘ముస్లిం తల్లులు, సోదరీమణుల ఎన్నో ఏళ్ల పోరాటం అనంతరం.. అప్పటికప్పుడు ఇచ్చే ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి మార్గం దొరికింది’ అని చెప్పారు.
70 ఏళ్ల సంప్రదాయాన్ని మార్చాం..
ముస్లిం మహిళలు హజ్ యాత్రకు వెళ్లాలంటే.. తప్పకుండా మగవారి తోడు ఉండాల్సిందేనన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. 70 ఏళ్ల నుంచి వస్తున్న ఆ సంప్రదాయాన్ని మారుస్తూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఇక ముస్లిం మహిళలు ఏ సంరక్షకుడి తోడూ లేకుండా హజ్ యాత్ర చేయవచ్చు. ఈ ఏడాది ఒంటరిగా హజ్ యాత్ర చేసేందుకు 1300 మంది ముస్లిం మహిళలు నమోదు చేసుకున్నారు. వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా మైనార్టీ వ్యవహారాల శాఖను నేను ఆదేశించాను.
నవ భారతానికి మీరే పునాది
Published Mon, Jan 1 2018 1:19 AM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment