భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ సహా ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదైంది.
భోపాల్: భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ సహా ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సదోల్ జిల్లాలో చోటుచేసుకుంది. పాఠశాల డైరీలో ఇండియా పటంలో కశ్మీర్ ను వేరే దేశం భూభాగంలో ఉన్నట్టు చిత్రీకరించారు. దీంతో పాఠశాల యాజమాన్యంపై బీజేపీ యువమోర్చా కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రీన్ బెల్స్ స్కూలు యజమాని మహ్మద్ షరీఫ్ ప్రిన్సిపల్ గోవింద్ చంద్ర దాస్, ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ఏకే అగర్వాల్ లపై దేశద్రోహం కేసును నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు తరలించారు.
‘భూ ఖగోళ ప్రాంత సమాచార నియంత్రణ బిల్లు-2016’ ప్రకారం భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరిస్తే కఠినశిక్ష విధించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈమధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లను వరుసగా పాకిస్తాన్, చైనా భూభాగాలని సూచించడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.