
ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాది నుంచి లభ్యమైన మ్యాప్
కౌంటింగ్ రోజు ఉగ్ర దాడికి ప్రణాళిక..?
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా ఉత్కంఠ రేపిన సార్వత్రిక సమరంలో విజేతలు ఎవరో తేలనున్న మే 23న అదును చూసి ఉగ్రదాడితో విరుచుకుపడాలని ఉగ్రమూకలు సంసిద్ధమైనట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు తమ టార్గెట్లుగా ఎంచుకున్న వాటిలో శ్రీనగర్, అవంతిపుర వైమానిక స్ధావరాలు ఉన్నట్టు సమాచారం.
సొపియాన్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల్లో ఒక మృతదేహం నుంచి ఓ స్కెచ్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీనగర్, అవంతిపుర ఎయిర్‌బేస్‌లపై దాడికి ఉగ్ర మూకలు ప్రణాళిక రూపొందించినట్టు ఈ స్కెచ్ వెల్లడించింది.
కాగా, ఈనెల 14న పుల్వామాలో ఉగ్ర కమాండర్ల భేటీలో హిజ్బుల్ ముజహిదీన్‌కు చెందిన రియాజ్ నైకూ, ఇద్దరు జైషే టెర్రరిస్టులు, లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్ దర్‌లు పాల్గొని భద్రతా, సాయుధ దళాలపై దాడికి వ్యూహం రూపొందించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. రంజాన్ మాసంలో ముఖ్యంగా ఓట్ల లెక్కింపు చేపట్టే మే 23న భారీ ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారని వెల్లడించాయి.