సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడితో పాకిస్తాన్‌కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ఇమ్రాన్ స్పందన ఊహించిందేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హేయమైన ఈ ఘటనను పాక్ ప్రధాని ఖండించలేదని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలపలేదని విస్మయం వ్యక్తం చేసింది. ఉగ్రవాద దాడుల్లో పాక్ ప్రమేయానికి సంబంధించి జైషే మహ్మద్ బాధ్యత వహించినా ఇమ్రాన్ ఖాన్ ఈ విషయం విస్మరించారని పేర్కొంది.
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, జైషే చీఫ్ మసూద్ అజర్‌లు పాకిస్తాన్ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తమపై ఆరోపణలు చేస్తోందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ముంబై దాడులకు సంబంధించి పాకిస్తాన్‌కు భారత్ స్పష్టమైన ఆధారాలు అందచేసినా పదేళ్లకు పైగా ఈ కేసు ముందుకు కదలలేదని గుర్తుచేసింది.
పటాన్‌కోట్ దాడుల్లోనూ దర్యాప్తు కొలిక్కిరాలేదని ప్రస్తావించింది. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశంగా ఉందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలనూ ఖండించింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కీలక కేంద్రంగా ఉందని అంతర్జాతీయ సమాజం గుర్తెరిగిందని పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే భారత్ ఉగ్ర దాడిపై తీవ్రంగా స్పందిస్తోందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలనూ తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment