భారత పతకాలపై సీఎం అసంతృప్తి!
రియో ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాతనైనా మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉందని పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అభిప్రాయపడ్డారు. అకాలీదళ్ దివంగత అధ్యక్షుడు హరచంద్ సింగ్ లాంగోవాల్ వర్ధంతి కార్యక్రమంలో శనివారం పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వందల కోట్ల జనాభా ఉన్న దేశమైనా భారత్కు పతకాలు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. గత ఒలింపిక్స్ తో పోల్చితే ఇప్పుడు పతకాల సంఖ్య తగ్గిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
కాంస్య పతకాన్ని అందించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్, రజతాన్ని సాధించిన పీవీ సింధులను అభినందించారు. ఈ ఇద్దరు మహిళా ప్లేయర్లు దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. ఏది ఏమైతేనేం వందల కోట్ల జనాభా ఉన్నా మనకు ఒలింపిక్స్ లో పతకాలు రావడం లేదన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలని సూచించారు. ఆటల కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి ఆటగాళ్లను ప్రోత్సహించాలన్నారు. చిన్న వయసు నుంచే ఆటపై మక్కువ చూపే వారికి కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారుచేసే కార్యక్రమాలు చేపట్టాలని పంజాబ్ సీఎం బాదల్ పిలుపునిచ్చారు.