గగనంలో ఉత్కంఠ | Mid-air collision of three planes averted in Delhi region | Sakshi
Sakshi News home page

గగనంలో ఉత్కంఠ

Published Sat, Dec 29 2018 2:57 AM | Last Updated on Sat, Dec 29 2018 2:57 AM

 Mid-air collision of three planes averted in Delhi region - Sakshi

ముంబై: ఢిల్లీ గగనతల సమాచార ప్రాంతంలో(ఎఫ్‌ఐఆర్‌)లో ఘోర ప్రమాదం తప్పింది. సమీపంగా వచ్చిన మూడు విమానాలు ఢీకొనకుండా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ), ఇతర ఆటోమేటిక్‌ హెచ్చరికలు నిలువరించాయి. ఆ సమయంలో 3 విమానాల్లో కలపి వందలాది ప్రయాణికులు ఉన్నారు. డిసెంబర్‌ 23న జరిగిన ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) విచారణ ప్రారంభించింది. డచ్‌ విమానం కేఎల్‌ఎమ్, తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్, అమెరికా విమానం నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ ఎన్‌సీఆర్‌ 840 దాదాపు ఢీకొనేంత దగ్గరికొచ్చాయి.

తొలుత ఎన్‌సీఆర్‌ 31 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. ఇవా విమానం ఎన్‌సీఆర్‌కు చేరువగా వచ్చింది. రెండు విమానాల్లో అంతర్గత హెచ్చరికలు జారీచేయడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో కేఎల్‌ఎమ్‌ 33 వేల అడుగుల ఎత్తులో ఉంది. హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌సీఆర్‌ 35 వేల అడుగుల ఎత్తుకు ఎగిరి చక్కర్లు కొట్టింది. తర్వాత ఎడమ వైపు తిరగాలని ఏటీసీ ఆదేశించింది. ఈ మధ్యలో ఇవా.. కేఎల్‌ఎం ఎగురుతున్న 33 వేల అడుగుల ఎత్తుకు చేరడంతో మరో హెచ్చరిక జారీ అయింది. దీంతో ఇవాను పైలట్లు కేఎల్‌ఎం నుంచి దూరంగా నడిపారు. అదే సమయంలో ఎన్‌సీఆర్‌ 33 వేల అడుగుల స్థాయికి దిగిరావడంతో ఇవాకు సమీపంగా వచ్చింది. దీంతో మరోసారి హెచ్చరిక పంపి ప్రమాదాన్ని తప్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement