అర్ధరాత్రి హైడ్రామా
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ క్షమాభిక్షపిటీషన్ని తిరస్కరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మెమన్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరికొందరు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు రాత్రి 12 గంటల సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కూడా అక్కడకు చేరుకొని మెమన్ తరఫు న్యాయవాదుల పిటీషన్లను తీసుకొని సీజేఐ కు సమర్పించారు.
క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం సరికాదని ...ఒక వేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని కావున తమ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు.
తెల్లవారుజామున మూడుగంటలకు సుప్రీం కోర్టులోని హాల్లో మెమన్ ఉరిశిక్ష వాయిదాకు సంబంధించిన తుది విచారరణ ప్రారంభమైంది. అంతకు ముందులాగే ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు మెమన్ ఉరిశిక్ష నిలిపివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉరిశిక్ష అమలుకు 10గంటల ముందు దాఖలు చేసిన క్షమాభిక్షపిటీషన్ చెల్లు బాటుకాదని, నిజానికి ఈ కేసులో వాస్తవ న్యాయప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయిందని ఆటార్నిజనరల్ ముకుల్ రోహత్గి పేర్కొన్నారు.
ఇంతకు ముందు క్షమాభిక్షపిటీషన్ మెమన్ సోదరుడు దాఖలు చేయగా, తాజాగా బుధవారం రాష్ట్రపతికి అందిన పిటిషన్ మెమన్ ఇచ్చిందని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం బుధవారం సాయంత్రం నుంచి శిక్షఅమలుకు 14 రోజుల వ్యవధి ఉండాలని మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్నఅనంతరం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రాసిక్యూషన్కు అనుకూలంగా తీర్పువెలువరించడంతో మెమన్ ఉరి అమలుకు అడ్డంకులు తొలగినట్లయింది.