భోపాల్: కరోనా.. దేశాన్ని ఇంట్లో బంధించింది.. వలస కూలీలను రోడ్డున పడేసింది. మహమ్మారి కట్టడిలో భాగంగా మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయితే ఈ చర్యలు వలస కూలీల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఉన్నచోట పనులు లేక, చేతిలో డబ్బు లేక సొంతూర్ల బాట పట్టారు వలస కూలీలు. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ రవాణా సౌకర్యాలు స్తంభించిపోవడంతో చేసేదిలేక కాలిబాటన స్వగ్రామాలకు బయలుదేరారు. వీరిలో గర్భిణులు, చిన్న పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరిని ఇంటికి చేర్చడం కోసం కుటుంబ సభ్యులు చేస్తోన్న ప్రయత్నాలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
8 నెలల గర్భవతి అయిన భార్య, రెండేళ్ల కూతురుతో ఓ వ్యక్తి చేస్తోన్న ప్రయాణం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని బాలాకోట్‌కు చెందిన రాము, గర్భవతి అయిన తన భార్య ధన్వంత భాయితో కలిసి ఉపాధి కోసం ఈ ఏడాది మార్చి 17న హైదరాబాద్‌కు వచ్చారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో వారం రోజుల వ్యవధిలోనే లాక్‌డౌన్ ప్రకటించారు. చేతిలో డబ్బు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డారు. ఇక్కడే ఉండి ఆకలితో అలమటించే కంటే.. సొంత ఊరు వెళ్లి అయిన వారి మధ్య ఉండాలనుకున్నారు. దాంతో భార్య ధన్వంతి, రెండేళ్ల కూతురు అనురాగిణితో కలిసి స్వస్థలానికి పయనమయ్యాడు రాము.(మూడ్ లేదు.. ఇక తెగతెంపులే)
అయితే అంత దూరం తన భార్య నడిచివెళ్లాలంటే ప్రమాదమని భావించి మార్గమధ్యలో చేతికి దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేశాడు రాము. దానిపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టి వందల కిలోమీటర్లు వారిని తీసుకెళ్లాడు. తినడానికి తిండి లేకున్నా అలాగే తన ప్రయాణం కొనసాగించాడు. రోడ్డున పోయే ఒకరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.(కరోనా గ్యాంగ్‌స్టర్స్)
‘తొలుత నా కూతుర్ని ఎత్తుకొని వెళ్లాలని భావించాను. కానీ అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లాలంటే కష్టం. పైగా నా భార్య నిండు గర్భిణి. దాంతో మార్గమధ్యలో దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేసి, వారిద్దర్నీ దానిపై కూర్చోబెట్టి లాక్కుంటూ ముందుకెళ్లాను’ అంటూ రామూ తన అనుభవాన్ని వివరించాడు. కాగా, మార్గమధ్యలో మహారాష్ట్ర పోలీసులు వీరి పరిస్థితిని చూసి సహాయం చేశారు. నితేశ్ భార్గవ అనే పోలీస్ అధికారి వారికి ఆహారం అందించి, వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి స్వస్థలానికి తరలించారు.(సారూ.. పొయొస్తం..)
Comments
Please login to add a commentAdd a comment